Begin typing your search above and press return to search.

`సతీ లీలావతి` అన్ని వర్గాలకు వినోదం పంచే సినిమా: నిర్మాత నాగమోహన్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల - దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సతీ లీలావతి` మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   2 May 2026 4:21 PM IST
`సతీ లీలావతి` అన్ని వర్గాలకు వినోదం పంచే సినిమా: నిర్మాత నాగమోహన్
X

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల - దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సతీ లీలావతి` మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్‌ఎంఎస్’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శనివారం జరిగిన వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు అండగా నిలిచారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగమోహన్ మాట్లాడుతూ.. `సతీ లీలావతి` అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో రూపొందిందని ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ ప్రారంభం నుండి ప్రమోషన్ల వరకు సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ అందించిన సహకారం వల్లనే సినిమాను అనుకున్న సమయానికి, అత్యున్నత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగామని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం సినిమా స్థాయిని పెంచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని వ‌ర్గాల‌కు వినోదం పంచే సినిమా ఇద‌ని తెలిపారు.

దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ.. రామ్ చరణ్ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. రైటింగ్ విభాగంలో ఉదయ్ అందించిన సహకారం, అలాగే డైరెక్షన్ టీం పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. మే 8న థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరారు. ‘సతీ లీలావతి’ చిత్రంలో హాస్యం, భావోద్వేగాలు సమపాళ్లలో ఉంటాయని ఆయన వివరించారు.

చిత్ర కథానాయకుడు దేవ్ మోహన్ మాట్లాడుతూ,.. తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్ళీ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర చాలా వైవిధ్యంగా, కొత్తగా ఉంటుందని వెల్లడించారు. లావణ్య త్రిపాఠితో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవమని, ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే సినిమా విజయంపై నమ్మకం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రామ్ చరణ్ ఈ చిత్రానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ, లావణ్య త్రిపాఠి నటనలో చాలా సహజంగా కామెడీ పండించిందని ప్రశంసించడం విశేషం. మరోవైపు ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ షో వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు లావణ్య త్రిపాఠి ప్రకటించారు. మెగా కుటుంబ సభ్యుల అండదండలతో వస్తున్న `సతీ లీలావతి` బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వినోదాన్ని పంచుతుందో చూడాలి.