సూపర్‌స్టార్ వైఫ్ హోటల్‌లో కల్తీ ఫుడ్?
దీనికి సమాధానం వెతుకుతూ ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సార్ధక్ సచ్ దేవా చేసిన ప్రయత్నం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
By: Tupaki Desk | 18 April 2025 8:30 PMసెలబ్రిటీలంతా రెస్టారెంట్ చైన్ వ్యాపారంలో బిజీగా ఉన్నారు. హోటల్స్, ఆతిథ్య రంగాల్లో భారీగా ఆర్జిస్తున్నారు. అయితే సెలబ్రిటీ రెస్టారెంట్లలో ధరలు అసాధారణమైనవి. జేబు ఖాళీ చేసే పెద్ద ధరలకు తగ్గట్టుగానే క్వాలిటీ మెయింటెయిన్ చేస్తున్నారా? అన్నది ఒక చిక్కు ప్రశ్న. దీనికి సమాధానం వెతుకుతూ ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సార్ధక్ సచ్ దేవా చేసిన ప్రయత్నం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
అతడు ముంబైలోని పలువురు స్టార్ సెలబ్రిటీలు నిర్వహిస్తున్న హోటళ్లకు వెళ్లాడు. 'మిషన్ పనీర్' అనేది అతడి కాన్సెప్ట్. ప్రతి హోటల్ లో పనీర్ కోసం ఉపయోగించే పదార్థాలు ఒరిజినల్ గా నాణ్యతతో ఉన్నాయా లేదా? అన్నది పరిశోధించేందుకు అతడు తాను తింటున్న ప్లేట్ లోంచి ఒక పనీర్ ముక్కను తీసి దానిపై అయోడిన్ టెస్ట్ చేసాడు. ప్రతి చోటా తాను చేసిన టెస్ట్ లో రిజల్ట్ ఏం వచ్చిందో పబ్లిక్ కి చూపించాడు.
విరాట్ కోహ్లీ -వన్ 8 కమ్యూన్, శిల్పా శెట్టి- బాస్టియన్, బాబీ డియోల్-సమ్‌ప్లేస్ ఎల్స్, గౌరీ ఖాన్ -పాలి హిల్ తినుబండారా 'టోరి' వంటి చోట్ల విజిట్ చేసాడు. అన్నిచోట్లా పన్నీర్ తిన్నాడు. ప్రతి చోటా పనీర్ ప్రామాణికతను పరీక్షించాడు. కానీ షారూఖ్- గౌరీ ఖాన్ ల 'టోరి'లో మాత్రం తేడాను పసిగట్టాడు. టోరీలో వడ్డించే పనీర్ అయోడిన్ పరీక్ష సమయంలో నల్లగా మారిందని ఆరోపించాడు. దానికి ఉపయోగించిన స్టార్చ్ కలుషితమైందని సచ్ దేవ్ అన్నాడు. మిగతా హోటళ్లలో స్టార్చ్ లేకుండా ఒరిజినల్ గా బాగానే ఉంది.
పనీర్ లో ఉపయోగించే స్టార్చ్ ను చెక్ చేసేందుకు అయోడిన్ టింక్చర్ పరీక్ష ఉపకరిస్తుంది. సహజంగా తయారు చేసిన పనీర్‌లో స్టార్చ్ ఉండకూడదు. ఒకవేళ పనీర్ పై అయోడిన్ వేయగానే 'నీలం-నలుపు' రంగులోకి మారితే అది ఫేక్. టోరీ హోటల్ పనీర్ ఫేక్ అని అతడు తేల్చాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే, రెస్టారెంట్ ఒక వివరణ ఇచ్చింది. అతడు వేలెత్తి చూపిన ఆ వంటకం సోయా ఆధారిత పదార్థాలను కలిగి ఉందని, అయోడిన్ టెస్ట్ సరిగా చూపించదని వాదించారు. తమ హోటల్ లో స్వచ్ఛమైన నాణ్యమైన పదార్థాలను అందిస్తున్నామని స్టాఫ్ చెప్పారు. అయితే దీనిపై గౌరీఖాన్ స్పందించలేదు. తాజా పరిణామంతో సెలబ్రిటీ హెటల్స్ తో పాటు, చాలా ముంబై హోటల్స్ జవాబుదారీగా మారతాయని అందరి ఆశ.