Begin typing your search above and press return to search.

కేడీ సాంగ్ ఇష్యూ.. డైరెక్టర్ ఏమన్నారంటే?

తాజాగా మీడియాతో ప్రేమ్‌ మాట్లాడుతూ.. "ఆ పాటను ఐదు భాషల్లో విడుదల చేశాం. అందులో కన్నడ లిరిక్స్‌ను నేనే రాశాను.

By:  M Prashanth   |   26 March 2026 7:00 PM IST
కేడీ సాంగ్ ఇష్యూ.. డైరెక్టర్ ఏమన్నారంటే?
X

పాన్‌ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న కేడీ: ది డెవిల్ చిత్రంలోని సర్కే చునార్‌ తేరీ సర్కే సాంగ్ చుట్టూ నెలకొన్న వివాదంపై దర్శకుడు ప్రేమ్ స్పందించారు. ఆ పాటలోని హిందీ లిరిక్స్‌ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక పాటను అంత పెద్ద వివాదంగా మార్చడం అవసరం లేదేమోనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా మీడియాతో ప్రేమ్‌ మాట్లాడుతూ.. "ఆ పాటను ఐదు భాషల్లో విడుదల చేశాం. అందులో కన్నడ లిరిక్స్‌ను నేనే రాశాను. కానీ హిందీపై నాకు అంతగా పట్టు లేదు. అందుకే ఆ లిరిక్స్‌ పూర్తి అర్థం నాకు తెలియదు" అని తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, దేశంలో గ్యాస్‌ కొరత వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయని తెలిపారు.

వాటిపై చర్చించాలి గానీ, ఒక పాట లిరిక్స్‌ ను పెద్ద విషయంగా తీసుకోవడం సరైనది కాదని అన్నారు. ఆ వివాదం కావాలని క్రియేట్ చేశారన్న వార్తలను కూడా ప్రేమ్‌ ఖండించారు. తమ సినిమా ఒక ఎమోషనల్‌ కథాంశంతో రూపొందుతోందని, ఇందులోని ఆ పాట కేవలం పార్టీ సీన్‌ లో సరదా కోసం మాత్రమే ఉంచినదని స్పష్టం చేశారు. ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే ఆ పాటను చేర్చినట్లు చెప్పారు.

కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆ పాటకు మంచి స్పందన వస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఆ పాట హిందీ వెర్షన్‌ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో, ఆ వెర్షన్‌ ను యూట్యూబ్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే మిగతా భాషల్లో సాంగ్ కొనసాగుతోంది. ఇక ఈ వివాదంపై దర్శకుడు ప్రేమ్‌ భార్య, నటి రక్షిత కూడా స్పందించారు.

గతంలో వచ్చిన అనేక పాటల్లో ఇలాంటి పదాలు ఉన్నప్పటికీ, అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని గుర్తుచేశారు. చోలీ కే పీచే క్యా హై, పీలింగ్స్, డ్రీమమ్ వేకపమ్ వంటి ఎన్నో పాటలు వచ్చాయని, అవి అందరికీ సాధారణంగానే అనిపించాయని తెలిపారు. కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.

కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నటి నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఆ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న మూవీ ఏప్రిల్‌ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వివాదాలు మధ్యలో వచ్చినప్పటికీ, చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.