Begin typing your search above and press return to search.

‘సర్దార్-2’ మూవీ రివ్యూ

విజయ్ (కార్తి) భారత నిఘా విభాగం ‘రా’లో ఏజెంట్. కానీ అతడికి అక్కడ అంత మంచి గుర్తింపుండదు. దేశద్రోహిగా ముద్రపడి ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు ఉన్న ఒకప్పటి సీక్రెట్ ఏజెంట్ సర్దార్ (కార్తి) కొడుకే ఈ విజయ్.

By:  Tupaki Desk   |   10 Sept 2026 12:23 PM IST
‘సర్దార్-2’ మూవీ రివ్యూ
X

‘సర్దార్-2’ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తి- మాళవిక మోహనన్- ఆశికా రంగనాథ్- ఎస్.జె.సూర్య- అచ్యుత్ కుమార్- నిళల్ గల్ రవి- యోగి బాబు- ఆశిష్ విద్యార్థి తదితరులు

సంగీతం: సామ్ సీఎస్

ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్

నిర్మాతలు: లక్ష్మణ్ కుమార్- ఇషాన్ సక్సేనా

రచన-దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్

కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న తమిళ కథానాయకుడు కార్తి.. ఇప్పుడు తన హిట్ మూవీ ‘సర్దార్’ సీక్వెల్ ‘సర్దార్-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా కార్తి కోరుకున్న విజయాన్నందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

విజయ్ (కార్తి) భారత నిఘా విభాగం ‘రా’లో ఏజెంట్. కానీ అతడికి అక్కడ అంత మంచి గుర్తింపుండదు. దేశద్రోహిగా ముద్రపడి ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు ఉన్న ఒకప్పటి సీక్రెట్ ఏజెంట్ సర్దార్ (కార్తి) కొడుకే ఈ విజయ్. తన తండ్రి బతికే ఉన్నాడని విజయ్ బలంగా నమ్ముతాడు. దేశ భద్రతకు కీలకమైన ఒక మిషన్లో తన వంతు పాత్ర పోషించి మంచి పేరు సంపాదించడమే కాక.. తండ్రి జాడను కూడా కనిపెట్టాలన్నది విజయ్ లక్ష్యం. ఇందులో భాగంగా దేశానికి ముప్పుగా పరిణమించిన బ్లాక్ డ్రాగర్ (ఎస్.జె.సూర్య) తలపెట్టిన ఒక ప్రమాదకర కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో పడతాడు విజయ్. ఇంతకీ బ్లాక్ డ్రాగర్ తలపెట్టిన మిషన్ ఏంటి.. దాని వల్ల దేశానికి వచ్చిన ముప్పేంటి.. దీన్ని విజయ్ ఆపగలిగాడా.. ఇంతకీ సర్దార్ నిజంగా చనిపోయాడా లేదా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

తమిళ దర్శకుడు పి.ఎస్.మిత్రన్ చేసింది మూడు సినిమాలే అయినా.. అతను వేసిన ముద్ర బలమైంది. తన తొలి చిత్రం ఇరుంబుతిరై (తెలుగులో అభిమన్యుడు)లో అతను చర్చించిన మొబైల్ ప్రైవసీ అంశం ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. రెండో సినిమా ‘శక్తి’ అనుకున్నంతగా ఆడకపోయినా.. అది కూడా కంటెంట్ ఉన్న సినిమానే. ఇక మూడో చిత్రం ‘సర్దార్’లో వాటర్ మాఫియా గురించి ఎంత అర్థవంతంగా చర్చించాడో తెలిసిందే. ఒకవైపు ప్రేక్షకులకు అవసరమైన వినోదాన్ని అందిస్తూనే.. ప్రతి సినిమాలోనూ అండర్ కరెంట్ గా ఒక సందేశాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా ఎక్కించిన గొప్ప నైపుణ్యం తనది. ఈ దర్శకుడు ఈసారి బయో వార్ నేపథ్యంలో ఇంకో మంచి పాయింట్ తీసుకున్నాడు. దాని మీద ఎంతో రీసెర్చ్ చేశాడు. ఎంతో కసరత్తు చేసి కథను తీర్చిదిద్దుకున్నాడు. కానీ ఈ పాయింటుని ప్రేక్షకులకు అర్థమయ్యేలా.. వాళ్లను కన్విన్స్ చేసేలా తెరపై ప్రెజెంట్ చేయడంలో మాత్రం మిత్రన్ తీవ్రంగా తడబడ్డాడు. ఈ కథకు అత్యంత కీలకమైన విలన్ పాత్రను అర్థరహితంగా తయారు చేయడం.. కథ బాగున్నా కథనం తీవ్ర గందరగోళానికి గురి చేసేలా సాగడంతో ‘సర్దార్-2’ చివరికి ఒక ప్రయాసలా తయారైంది. మంచి కథ.. గొప్ప ఎఫర్ట్ ఉన్నప్పటికీ.. ‘సర్దార్’ ఆశించిన అనుభూతిని మాత్రం అందించలేకపోయింది.

‘సర్దార్-2’ ఎంతో ఎఫర్ట్ పెట్టిన రాసిన కథతో తయారైన సినిమా. దీని స్టోరీ ఏంటి అని అడిగితే.. వివరించి చెప్పడం కూడా కష్టం. రైటర్ కమ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ అంత భారీగా.. అనేక లేయర్లతో ఆ కథను రాసుకున్నాడు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టి రాసినా.. తెర మీద ఎంత భారీగా ఆ కథను ప్రెజెంట్ చేసినా.. చెప్పాలనుకున్న విషయం అర్థవంతంగా అనిపిస్తేనే.. ప్రేక్షకులకు అది సరిగ్గా చేరితేనే మంచి అనుభూతి కలుగుతుంది. ‘సర్దార్’లో వాటర్ మాఫియా అంశాన్ని.. ఒక పంచె కట్టిన గూఢచారి చేసే విన్యాసాలను మిత్రన్ అలా అర్థవంతంగానే తెరపై ప్రెజెంట్ చేశాడు. కానీ ‘సర్దార్-2’కు వచ్చేసరికి.. బయో వార్ కాన్సెప్టు చుట్టూ అల్లుకున్న కథను కనీసం తన టీం సభ్యులకు అయినా అర్థమయ్యేలా చెప్పగలిగాడా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే తెరపై ఈ కథ అంత కంగాళీగా తయారైంది. ముఖ్యంగా ఎస్.జె.సూర్య చేసిన విలన్ పాత్రను తీర్చిదిద్దిన విధానమే ప్రేక్షకులకు తీవ్ర గందరగోళంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు అతను విలనో హీరోనో అర్థం కాదు. ఒకవైపేమో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల జరిగే అనర్థాల గురించి క్లాసులు పీకుతాడు. ఇంకోవైపేమో అలా చేయడం తప్పు కాబట్టి ఆ మనుషులకు బతికే అర్హత లేదంటాడు. ఒకవైపేమో నా కుటుంబం-ఊరు దెబ్బ తింది కాబట్టి దేశం మొత్తాన్ని నాశనం చేస్తానంటాడు. ఇంకోవైపేమో ఈ తరం అంతా పోయాక ఒక మంచి తరాన్ని తయారు చేస్తా అంటాడు. దేశాన్ని కాపాడే క్రమంలో యాక్సిడెంటల్ గా ఒక ఊరిలో జనాలు చనిపోతే.. మొత్తం దేశం మీద కక్షగట్టి దాన్ని నాశనం చేయాలని చూడడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు.

పోనీ విలన్ పాత్ర బాధనైనా బలంగా చూపించి.. ఆ పాత్రను పూర్తి సీరియస్ గా తీర్చిదిద్ది ఉంటే ప్రేక్షకులకు అది కన్విన్సింగ్ గా అనిపించేదేమో. కానీ ఆ పాత్రేమో సినిమా అంతా చాలా కామెడీగా.. తిక్కతిక్కగా ప్రవర్తిస్తుంటుంది. అన్ని జబ్బులకూ ఒకటే మందు అన్నట్లుగా ఎస్.జె.సూర్య ఈ పాత్రకు ఏమాత్రం సూట్ కాని తన ఓవర్ ద టాప్ యాక్షన్ తో ఈ క్యారెక్టర్ని ఖూనీ చేసేశాడు. ‘సర్దార్-2’ మొదలైన తీరు చూస్తే ఒక ఉత్కంఠభరిత థ్రిల్లర్ చూడబోతున్నామనే ఆశలు కలుగుతాయి. ఏమాత్రం డీవియేషన్ లేకుండా తొలి సన్నివేశం నుంచే కథ చెప్పడం మొదలుపెట్టిన దర్శకుడు.. హీరోకు స్పెషల్ ఇంట్రో ఏమీ లేకుండా అతణ్ని కూడా కథలో భాగం చేశాడు. విలన్ పన్నిన భారీ కుట్రను డీకోడ్ చేయడానికి హీరో-మిగతా పాత్రలు చేసే ప్రయత్నాలతో ఆరంభంలో ‘సర్దార్-2’ ఆసక్తికరంగా సాగుతుంది. ‘ఆపరేషన్ డోకు’కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది.

కానీ రన్నింగ్ లో ఉన్న విమానంలోకి హీరో హీరోయిన్లు ఎక్కేసి గాల్లో చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలతో ‘సర్దార్-2’ ఉన్నట్లుండి సీరియస్ మోడ్ నుంచి సిల్లీ ఫిలింగా మారిపోతుంది. ఇక విలన్ రంగప్రవేశంతో మొత్తం కంగాళీగా తయారైపోయింది. తన స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేయాలనుకునే సగటు విలన్ పాత్రలా దీన్ని మలిచి ఉన్నా ఓకే కానీ.. దానికి ఎమోషనల్ టచ్ ఇవ్వబోయి ఆ క్యారెక్టర్ని ఎటూ కాకుండా తయారు చేశారు. విలన్ నేపథ్యానికి.. అతడి ప్రవర్తనకు అసలు పొంతనే ఉండదు. అసలు విలన్ లక్ష్యమేంటి.. అతనేం సాధించాలనుకుంటున్నాడు అన్నదే అంతుబట్టదు. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్ గురించి క్లాస్ పీకే సీన్ దగ్గర ‘సర్దార్-2’ మీద ఉన్న కాస్తో కూస్తో ఆశలు కూడా అడుగంటిపోతాయి. ‘సర్దార్’లో ఎంతో మెప్పించిన హీరో పాత్ర.. ఇక్కడ ప్యాసివ్ గా తయారైపోవడంతో ‘సర్దార్-2’ పుంజుకునే అవకాశమే లేకపోయింది. విలన్ బయో వెపన్ ను ప్రయోగించే ప్రయత్నాన్ని హీరో అడ్డుకునే నేపథ్యంలో సాగే క్లైమాక్స్ ‘లింగా’ సినిమాలో బబుల్ ఎపిసోడ్ ను గుర్తుకు తెస్తుంది. ఆ స్థాయిలో దాన్ని సిల్లీగా తయారుచేసి పెట్టారు. పనిగట్టుకుని ఒక కథను చెడగొట్టడం ఎలాగో చెప్పడానికి ‘సర్దార్-2’ను ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంతో ప్రామిసింగ్ గా మొదలై.. అంత పేలవంగా ముగుస్తుందీ చిత్రం.

నటీనటులు:

కార్తి పెర్ఫామెన్స్ పరంగా ఏమీ లోటు చేయలేదు. రెండు పాత్రల కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు. సర్దార్ పాత్రకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ లో తన ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ పాత్రలోని సున్నిత కోణం బయటపడే సన్నివేశంలో.. అలాగే సర్దార్ సంఘర్షణకు గురయ్యే సీన్లో కార్తి నటన కదిలిస్తుంది. వృద్ధుడైన సర్దార్ పాత్రలో మాత్రం కార్తి మామూలుగా అనిపిస్తాడు. తన మేకప్ అంత బాగా లేదు. విజయ్ పాత్రలో కార్తి మెప్పించాడు. మాళవిక మోహనన్ కు కథలో కీలకమైన పాత్రే దక్కింది. అందులో ఆమె బాగానే పెర్ఫామ్ చేసింది. ఆశికా రంగనాథ్ పర్వాలేదు. హీరోయిన్ల పాత్రల్ని పాటల కోసం లేదంటే హీరోతో రొమాన్స్ కోసం కాకుండా కథలో భాగంగానే పెట్టడం అభినందనీయమే. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య సినిమాకు పెద్ద ప్లస్ అవుతాడని ఆశిస్తే.. చివరికి మైనస్ అయ్యాడు. తన లౌడ్ యాక్టింగ్ ఈ పాత్రకు సూట్ కాలేదు. బ్లాక్ డ్రాగర్ పాత్రను చాలా గందరగోళంగా తయారు చేసి పెట్టగా.. దాన్ని సూర్య పోషించిన తీరు ఆ క్యారెక్టర్ని ఇంకా కంగాళీగా మార్చింది. యోగిబాబు.. నిళల్ గల్ రవి అక్కడక్కడా కాస్త కామెడీతో రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఆశిష్ విద్యార్థి.. అచ్యుత్ కుమార్.. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం:

‘సర్దార్-2’లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బాగా ఖర్చుపెట్టారు. చాలా పెద్ద స్కేల్లో సినిమాను తీర్చిదిద్దారు. టీం అంతా ఎంతో ఎఫర్ట్ పెట్టిన విషయం తెరపై కనిపిస్తుంది. కానీ అదెంత వరకు సినిమాకు ఉపయోగపడిందన్నది ప్రశ్నార్థకమే. సామ్ సీఎస్ బీజీఎం ఒక థ్రిల్లర్ సినిమాకు తగ్గట్లే ఉంది. కాకపోతే అతడి స్కోర్ ఒక మూసలో సాగిపోతోందనే ఫీలింగ్ కలుగుతుంది. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రచయిత-దర్శకుడు మిత్రన్ ఎఫర్ట్ ను తక్కువ చేయలేం. అతను చాలా కష్టపడ్డాడు. కథ విషయంలో చాలా రీసెర్చ్ చేశాడని.. ఎంతో కసరత్తు చేసి స్క్రిప్టు రాశాడని అర్థమవుతుంది. మేకింగ్ విషయంలోనూ పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది. కానీ ఎంత కష్టపడ్డప్పటికీ.. అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా కథను చెబితేనే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. కానీ రైటింగ్-టేకింగ్ లో విపరీతమైన గందరగోళం.. అర్థరహితంగా అనిపించే విలన్ పాత్ర వల్ల.. కన్విన్సింగ్ గా లేని కొన్ని సన్నివేశాల వల్ల మిత్రన్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది.

చివరగా: సర్దార్-2.. దారితప్పిన ఏజెంట్

రేటింగ్ - 2/5