నటుడు రాజకీయ నాయకుడు ఇద్దరు భార్యలతో ముచ్చటైన ప్రయాణం!
ఛాయాదేవితో విడాకులు తీసుకున్న ఏడాదికే 2001 ఫిబ్రవరి 4న శరత్ కుమార్ నటి రాధికను వివాహం చేసుకున్నారు.
By: Sivaji Kontham | 2 March 2026 9:29 AM ISTసీనియర్ నటుడు శరత్ కుమార్ వ్యక్తిగత జీవితం.. ఆయన రెండు వివాహాలకు సంబంధించిన వివరాలు సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. ఆయన జీవితంలో జరిగిన రెండు పెళ్లిళ్లు.. ఆయా సందర్భాల్లో ఎదురైన పరిస్థితుల గురించి ప్రజలు ఆరాలు నిత్యకృత్యం. ఇప్పుడు ఆయన కుమార్తె వరలక్ష్మి దర్శకత్వం వహించిన `సరస్వతి` రిలీజ్ ప్రమోషన్స్ లో శరత్ కుమార్ ఇద్దరు భార్యలు (మాజీ భార్య, ప్రస్తుత భార్య) ప్రధాన ఆకర్షణగా మారారు.
మొదటి వివాహం.. ఛాయాదేవితో..
శరత్ కుమార్ సినిమా రంగంలోకి రాకముందు.. అంటే ఆయన వ్యాపార రంగంలో ఉన్న సమయంలో 1984లో ఛాయాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్ (ప్రస్తుతం పాపులర్ నటి) , చిన్నమ్మాయి పూజ ఈ దంపతులకు ఉన్నారు.
శరత్ కుమార్ సినీ కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో సహనటితో ఆయనకు ఉన్న అనుబంధం వల్ల ఛాయాదేవితో విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనివల్ల 2000 సంవత్సరంలో వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత కూడా ఛాయాదేవి - శరత్ కుమార్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.
రెండో వివాహం: రాధికా శరత్ కుమార్‌తో..
ఛాయాదేవితో విడాకులు తీసుకున్న ఏడాదికే 2001 ఫిబ్రవరి 4న శరత్ కుమార్ నటి రాధికను వివాహం చేసుకున్నారు. రాధిక - శరత్ కుమార్ అంతకుముందే నమ్మ అన్నాచి, సూర్యవంశం వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. వారి మధ్య ఉన్న స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. అలాగే రాధికకు తన మునుపటి వివాహం ద్వారా జన్మించిన కుమార్తె రాయన్నే బాధ్యతను కూడా శరత్ కుమార్ స్వీకరించారు. రాయన్నే వివాహాన్ని శరత్ కుమార్ దగ్గరుండి జరిపించారు.
కుటుంబ బంధం..
శరత్ కుమార్ రెండో వివాహం చేసుకున్న సమయంలో ఆయన పెద్ద కుమార్తె వరలక్ష్మికి, రాధికకు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ రాధిక ఈ విషయంలో చాలా పరిణతితో వ్యవహరించారు. వరలక్ష్మి- రాధికను మధ్య సవతి తల్లి-కుమార్తె అనే బంధం కంటే స్నేహితుల బంధమే ఎక్కువగా కనిపిస్తుంది. వరలక్ష్మి సినిమాల్లోకి రావడం శరత్ కుమార్‌కు ఇష్టం లేకపోయినా, రాధికే చొరవ తీసుకుని ఆయనను ఒప్పించి వరలక్ష్మి కెరీర్‌కు పునాది వేశారు. ఇటీవల వరలక్ష్మి వివాహ వేడుకలో ఛాయాదేవి మరియు రాధికా శరత్ కుమార్ ఇద్దరూ కలిసి కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శరత్ కుమార్ తన ఇద్దరు భార్యల పిల్లలను సమానంగా ఆదరిస్తూ ఒకే కుటుంబంలా ముందుకు తీసుకెళ్తున్నారు.
శరత్ కుమార్ జీవితంలో రెండు వివాహాలు జరిగినా కానీ ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అందరినీ కలుపుకుని పోతున్నారు. నేడు టాలీవుడ్ , కోలీవుడ్‌లో ఈ కుటుంబం ఒక `హ్యాపీ ఫ్యామిలీ`గా గుర్తింపు పొందింది.
