Begin typing your search above and press return to search.

ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో క‌ట్టి ప‌డేసిన సారా

ట్రైల‌ర్ ఆద్యంతం యువ‌న‌టి సారా అలీఖాన్ స్వాతంత్య్ర‌ సమరయోధురాలుగా అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది.

By:  Tupaki Desk   |   5 March 2024 4:17 AM GMT
ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో క‌ట్టి ప‌డేసిన సారా
X

స్వాతంత్రోద్య‌మం నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ చాలా సినిమాలు ఇండియ‌న్ స్క్రీన్ పై విడుద‌ల‌య్యాయి. గొప్ప విజ‌యాల్ని సాధించాయి. ఇదే జాన‌ర్ లో వ‌స్తున్న తాజా చిత్రం `ఏ వతన్ మేరే వతన్` ట్రైలర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం యువ‌న‌టి సారా అలీఖాన్ స్వాతంత్య్ర‌ సమరయోధురాలుగా అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది.

ఆంగ్లేయుల దాష్టీకాల‌ను ఎదురించే ధీర‌వ‌నిత‌ విజువ‌ల్స్ ని ఈ ట్రైల‌ర్ లో చూపించారు. త‌ల్లిదండ్రులు 'చంపేస్తారు' అని త‌న‌ను వారిస్తున్నా విన‌కుండా త‌న దేశం కోసం పోరాడే యువ‌తిగా సారా అలీఖాన్ అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌ట్టి ప‌డేస్తోంది. భార‌త‌దేశ‌పు మువ్వ‌న్నెల జెండాను ప‌ట్టుకుని పోరాటంలోకి ఉద్య‌మంలోకి దూకే యువ‌తిగా సారా క‌నిపిస్తోంది.

1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ లో స్వాతంత్య్ర‌ సమరయోధులు - సారా అలీ ఖాన్ - స్పర్ష్ శ్రీవాస్తవ ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రించింది. భూగర్భ రేడియో స్టేషన్‌ను నడుపుతున్న 22 ఏళ్ల స్వాతంత్య్ర‌ సమరయోధురాలు ఉషా రాణి (సారా అలీ ఖాన్ పోషించింది) జీవితంలోని కష్టాలు, పోరాటాల గురించిన సినిమా ఇది. బ్రిటీష్ పాలనలో దేశవ్యాప్తంగా వార్తలను ప్రచారం చేసిన ధీర యువ‌తి ఉషా రాణి నిజ‌క‌థ‌. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. కన్నన్ అయ్యర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సారా అలీ ఖాన్ దేశభక్తి చిత్రంలో కనిపించడం ఇదే మొదటిసారి. అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన 'ఏ వతన్ మేరే వతన్' ట్రైలర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ఈ మార్చిలోనే సినిమా స్ట్రీమింగ్ కానుంది.