ధురంధర్ ఫేం.. ఎవరు ఈ 20 ఏళ్ల సారా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ (40) సరసన 20 ఏళ్ల అందమైన అమ్మాయి నటించడం చాలా విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 July 2025 10:45 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ (40) సరసన 20 ఏళ్ల అందమైన అమ్మాయి నటించడం చాలా విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు విడుదలైన ధురందర్ టీజర్ వెబ్ లో వేగంగా దూసుకుపోయింది. అయితే టీజర్ లో కొన్ని సెకన్లు మాత్రమే కనిపించినా కానీ, 20 ఏళ్ల బ్యూటీ కుర్రకారు హృదయాలను బరువెక్కేలా చేసింది. తనకంటే డబుల్ ఏజ్ ఉన్న రణ్ వీర్ తో చుంబనాలు లాగించేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుంది. బాలీవుడ్ సహా దక్షిణాది పరిశ్రమల్ని ఆకర్షించే అందం చందం తెగువ ఈ భామలో కనిపిస్తోందంటూ ఇప్పుడు చర్చ మొదలైంది. అసలింతకీ ఎవరీ 20 ఏళ్ల అమ్మాయి? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులివి.
ధురంధర్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రేమలో పడిన 20 ఏళ్ల అమ్మాయి పేరు - సారా అర్జున్. ధురంధర్ సారాకు కథానాయికగా డెబ్యూ సినిమానే అయినా బాలనటిగా తను సాధించినది అంతా ఇంతా కాదు. సారా ఒక మెరుపు తీగ. అందంతోనే కాదు ప్రతిభతో అల్లుకుపోయే గొప్ప నటి. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ (2022) లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాల్యం నాటి పాత్రను పోషించింది.
సారా అర్జున్ నటుడు రాజ్ అర్జున్ కుమార్తె. ఇంతకుముందు అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్‌స్టార్ (2017), తలైవి (2021) సహా పలు చిత్రాల్లో నటించింది. ఐదేళ్ల వయసులోనే 100 కి పైగా వాణిజ్య ప్రకటనలతో తన కెరీర్‌ను ప్రారంభించిన సారా అర్జున్ తమిళ హిట్ చిత్రం `దైవ తిరుమగల్` (2011)తో బాలనటిగా అడుగుపెట్టింది. ఈ సినిమా `నాన్న` పేరుతో తెలుగులోకి అనువాదమై విడదలైన సంగతి తెలిసిందే. అప్పట్లోనే తెలుగు రిలీజ్ ప్రమోషన్స్ కోసం విక్రమ్, అనుష్క, అమలాపాల్ తో కలిసి చిన్నారి సారా హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ మీడియాను ఎంతో ఆకర్షించింది. సారా ఆ తరువాత హిందీ, మలయాళం , తెలుగు సినిమాల్లో నటిగా బిజీ అయిపోయింది.
