నటీనటులు.. వస్తువులం కాదంటున్న హీరోయిన్
సప్తమి గౌడ ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చి, మహిళా నటీమణులందరూ ఈ విషయంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 3 March 2026 8:45 PM ISTకాంతార మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ తాజాగా ఒక ముఖ్యమైన సామాజిక అంశంపై గళం విప్పారు. సినిమా ఫంక్షన్లు, ఆడియో లాంచ్‌లు, ప్రమోషనల్ ఈవెంట్స్ లాంటి పబ్లిక్ వేదికలలో హీరోయిన్లు, ఇతర నటీమణుల పట్ల కొంతమంది ఫోటోగ్రాఫర్లు, కెమెరా ఆపరేటర్లు ప్రవర్తిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేసి వార్తల్లో నిలిచారు.
జూమ్ చేసి ఫోటోలు తీస్తున్నారు
పబ్లిక్ ఈవెంట్లలో తాము పాల్గొంటున్నది తమ వృత్తి పరమైన బాధ్యతల కోసం, కానీ కొందరు కెమెరామెన్‌లు అవసరం లేని విధంగా శరీర భాగాలపై జూమ్ ఇన్స్ చేస్తూ చిత్రీకరిస్తున్నారని సప్తమి గౌడ తన పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలోని మహిళలందరి తరపున తాను మాట్లాడుతున్నానని, తమ పనిని, తమ టాలెంట్ ను ఫోకస్ చేయకుండా, అసంబద్ధంగా బాడీ పార్ట్‌లపై జూమ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని, అది తమకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా అవమానంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఏ మాత్రం సహించరానివని సప్తమి స్పష్టం చేశారు.
ప్రొఫెషనలిజం పాటించాలని కోరిన సప్తమి
తాము ఇక్కడ ఉన్నది తమ నటన కోసం, తమ వృత్తి కోసమని, గౌరవప్రదమైన హద్దులను దాటి ప్రవర్తించడం సభ్యత కాదని, ఇది తమ హుందాతనాన్ని దెబ్బతీసే చర్య అని ఆమె తన నోట్ లో పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు ప్రొఫెషనలిజం పాటిస్తూ కనీస గౌరవం ఇవ్వాలని సప్తమి కోరారు. తన పోస్ట్‌కు నటీనటులం.. వస్తువులం కాదు(Actors not objects) అనే క్యాప్షన్ జతచేయడం ద్వారా ఈ సందేశాన్ని మరింత బలంగా తెలియజేశారు.
ఇప్పటికే నోరు విప్పిన పలువురు సెలబ్రిటీలు
ఈ సమస్య కొత్తది కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీమణులు కూడా పాపరాజీల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి లాంటి సెలబ్రిటీలు గతంలోనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అసభ్యకరంగా చిత్రీకరిస్తున్న వీడియోలను తప్పుబట్టారు. డ్రెస్సింగ్ స్టైల్, నడక లాంటి అంశాలను కావాలని హైలైట్ చేస్తూ తీసిన క్లిప్‌లు వైరల్ కావడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సప్తమి గౌడ ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చి, మహిళా నటీమణులందరూ ఈ విషయంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలో మహిళల పట్ల గౌరవం పెరగాలని, పబ్లిక్ వేదికలలో కనీస నైతిక ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని ఆమె సందేశం స్పష్టం చేస్తున్నారు. కెరీర్ పరంగా చూస్తే, సప్తమి గౌడ పలు సినిమాలతో ఆడియన్స్ ను అలరించారు. రీసెంట్ గా రిలీజైన ది రైజ్ ఆఫ్ అశోక మూవీతో కూడా ఆమె ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు. నటిగా ఎదుగుతున్న ఈ దశలోనే ఆమె పరిశ్రమలో మహిళల గౌరవంపై బహిరంగంగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
