'తమ్ముడు'తో రెండు గంటల యాక్టింగ్..!
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా విడుదలకు ముస్తాభయింది.
By: Tupaki Desk | 28 Jun 2025 7:00 PM ISTనితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా విడుదలకు ముస్తాభయింది. కొన్ని కారణాల వల్ల నెలల తరబడి ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు జులై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన దక్కింది. వేణు శ్రీరామ్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. వకీల్ సాబ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ మధ్య కాలంలో వేణు శ్రీరామ్ చేసిన హడావిడి నేపథ్యంలో సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా దక్కింది అనే విషయం తెల్సిందే.
ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీకి సిద్ధం అయింది. హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన లయ పెళ్లి చేసుకుని పూర్తిగా అమెరికా షిప్ట్ అయింది. కుటుంబ బాధ్యతలు, పిల్లలు ఇతర కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన లయ ఎట్టకేలకు రీ ఎంట్రీకి సిద్ధం అయింది. ఆమె ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్రలో కనిపించబోతుంది. తమ్ముడు అనే టైటిల్‌తోనే ఈ సినిమాలో లయ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా, ప్రాధాన్యతను కలిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమ్ముడు సినిమాలో కన్నడ ముద్దుగుమ్మ సప్తమి గౌడ నటించింది. కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న ఈమె తమ్ముడు సినిమాలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
కాంతార సినిమా తర్వాత తెలుగు నుంచి ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయట. కొన్ని కారణాల వల్ల వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన సప్తమి ఎట్టకేలకు ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సప్తమి పాత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఆమె పాత్ర, లుక్ చాలా విభిన్నంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరో నితిన్‌తో తన కాంబో సీన్స్ చాలా తక్కువగా ఉంటాయని ఒకటి రెండు సీన్స్‌కే పరిమితం కానున్నట్లు చెప్పుకొచ్చింది. నితిన్‌తో కలిసి ఈ సినిమా కోసం కేవలం రెండు గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నట్లు సప్తమి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హీరోతో హీరోయిన్ కేవలం రెండు గంటల షూటింగ్ ఏంటా అని అంతా షాక్ అవుతున్నారు.
ఆమె మాటలను బట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా సప్తమి ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. నితిన్‌తో పాటలు, లవ్ ట్రాక్ ఉండదని తేలిపోయింది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. ఆమెతో నితిన్ లవ్ ట్రాక్ ఉంటుందేమో చూడాలి. మొత్తానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండటంతో పాటు కీలక పాత్రలో లయ నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.
సినిమా సమయం ఎక్కువ కావడంతో పాటు, కొన్ని కారణాల వల్ల బడ్జెట్ చాలా ఎక్కువ అయిందట. దాంతో హీరో, దర్శకుడు పారితోషికం త్యాగం చేశారని, విడుదలైన తర్వాత వారు తమ పారితోషికం తీసుకునేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాపై నమ్మకంతో వారిద్దరూ పారితోషికంను సైతం త్యాగం చేసి మరీ సినిమా కోసం కష్టపడ్డారు. మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమ్ముడు మెప్పిస్తాడా... సప్తమి గౌడకు టాలీవుడ్‌లో హిట్‌తో ఎంట్రీ దక్కేనా అనేది చూడాలి.
