వాలెంటైన్స్ డే.. 'కపుల్'కు కలిసొస్తుందా?
టాలీవుడ్ లో ప్రతి ఏడాది ఫిబ్రవరి 14కు మంచి క్రేజ్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: Tupaki Desk | 10 Feb 2026 11:02 AM ISTటాలీవుడ్ లో ప్రతి ఏడాది ఫిబ్రవరి 14కు మంచి క్రేజ్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆ రోజు థియేటర్లలోకి వచ్చే సినిమాలు.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ముఖ్యంగా లవ్ స్టోరీలైతే ఆడియన్స్ లో మరింత ఆసక్తి రేపుతాయి. అలాంటి టైమింగ్ ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి.
సంతోష్, మానస కలిసి జంటగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అజయ్ కుమార్ రాజు రూపొందిస్తున్నారు. ప్రేమ, యువత ఆలోచనలు, మోడ్రన్ రిలేషన్స్ వంటి అంశాలతో సిద్ధమవుతున్న ఆ మూవీ.. వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. ముఖ్యంగా ట్రైలర్ మూవీపై ఆసక్తి రేపింది. అదే సమయంలో మేకర్స్ కూడా ప్రమోషన్లను సినిమా మూడ్ కు తగ్గట్టే సాఫ్ట్ గా నిర్వహిస్తున్నారు. భారీ హంగామా కాకుండా మెలోడీ పాటలు, క్యూట్ టీజర్లు, జంట మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసే వీడియోలతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కపుల్ ఫ్రెండ్లీ మూవీ.. సంతోష్, మానసకు ఇద్దరికీ కీలకమైన సినిమా. ఆ జంట కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మూవీ నిలుస్తుందా అని అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. నిజానికి.. సంతోష్ శోభన్ కు టాలెంట్ ఉన్న నటుడిగా గుర్తింపు ఉన్నప్పటికీ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. పలు సినిమాలు చేసినా.. అవి ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లేదు.
అందుకే మంచి కథ, సరైన టైమింగ్ ఉంటే తిరిగి ఫామ్ లోకి రావచ్చనే నమ్మకంతో సంతోష్ కపుల్ ఫ్రెండ్లీపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మానస వారణాసి విషయానికి వస్తే, మోడలింగ్ వరల్డ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమెకు ఇప్పటివరకు పెద్ద బ్రేక్ దక్కలేదు. అశోక్ గల్లా హీరోగా వచ్చిన సినిమాలో నటించినప్పటికీ ఆ చిత్రంతో అనుకున్నంత క్రేజ్ రాలేదు. అందుకే ఈసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను మెప్పించాలని భావిస్తోంది.
అదే సమయంలో వాలెంటైన్స్ డే రోజు ప్రేమ కథా చిత్రాలకు ఫ్యామిలీ, యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే కపుల్ ఫ్రెండ్లీ మూవీకి ప్లస్ పాయింట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే.. హిట్ గా నిలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందుకే కెరీర్ లో సంతోష్, మానసకు కీలకమైన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. వాలెంటైన్స్ డే రిలీజ్ కలిసొస్తుందో లేదో అన్నది వేచి చూడాలి.
