హీటెక్కిస్తోన్న సంక్రాంతి టైటిల్స్!
సంక్రాంతి సీజన్ ను స్టార్ హీరోలు తమ కొత్త సినిమాల రిలీజ్ లకు లాక్ చేస్తోన్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.
By: Srikanth Kontham | 1 March 2026 12:00 AM ISTసంక్రాంతి సీజన్ ను స్టార్ హీరోలు తమ కొత్త సినిమాల రిలీజ్ లకు లాక్ చేస్తోన్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పటి నుంచే 2027 సంక్రాంతిని బ్లాక్ చేయడం ప్రారంభించారు. సీనియర్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. బాక్సాఫీస్ వసూళ్లకు సంక్రాంతి సీజన్ ను పర్పెక్ట్ కావడంతో? రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు. ఎంత పోటీ ఉన్నా? థియేటర్ల ఆక్యుపెన్సీ బాగుంటుంది అన్న కారణంతో థియేటర్ల సంఖ్య తక్కువైనా అదే సీజన్ కు కట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పేరుతో సినిమా టైటిల్స్ సైతం అంతే వేగంగా రిజిస్టర్ అవుతున్నాయి.
శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'హ్యాపీ పొంగల్' అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీనువైట్ల సినిమా లంటే పక్కా ఎంటర్ టైనర్లే. ఓ ఫ్యామిలీ కథ చుట్టూనే చక్కని కామెడీని అల్లడం అతడి ప్రత్యేకత. యూత్ స్టార్ నితిన్ హీరోగా 'ఆయ్' ఫేమ్ అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. 'సంక్రాంతి శుభాకాంక్షలు' అని రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో ఈ చిత్రం నిర్మాణం కానుంది. అలాగే యువ నిర్మాత రాజేష్ దండా ఈ మధ్య కాలంలో మంచి విజయాలు అందుకుంటున్నాడు.
కథలపై మంచి అవగాహన కలిగి ఉంటున్నాడు. దీనిలో భాగంగా సొంత నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ పై సినిమాలు నిర్మిస్తూనే ఇతర బ్యానర్లలలో సహా నిర్మాతగా పని చేస్తున్నారు. ఈనేపథ్యంలో రాజేష్ `అదిరిపొద్ది సంక్రాంతి` టైటిల్ ను కొత్త సినిమా కోసం ముందుగానే రిజిస్టర్ చేయించారు. 'అదిరిపొద్ది సంక్రాంతి' అన్నది 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో ఓ పాటతో ఎంతో ఫేమస్ అయింది. అలాగే 'పండగ బొమ్మ' అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ అయింది. ఈ టైటిల్ లో ఎక్కడా సంక్రాంతి అనే పదం లేనప్పటికీ `పండగ బొమ్మ` అంటే? కేవలం సంక్రాంతి మాత్రమే గుర్తొస్తుంది.
అలాంటి టైటిల్ కు ముందు వెనుకా? సంక్రాంతి లేకపోయినా మార్కెట్ లో కి సులువు గా వెళ్లిపోతుంది. ఎంతో క్యాచీ టైటిల్ కూడా. 'సంక్రాంతి' టైటిల్ తో వెంకటేష్ ఇప్పటి వరకూ చేసిన రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. తొలి సినిమా 'సంక్రాంతి', ఆ తర్వాత రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు వెంకీ కెరీర్లో మైల్ స్టోన్ చిత్రాలు. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన 'సంక్రాంతి అల్లుడు' మంచి విజయం సాధించింది. ఇంకా 'సంక్రాంతి అల్లుళ్లు' పేరుతో టీవీలో పలు ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ కూడా టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే.
