వామ్మో.. సంక్రాంతి రేసులో ఇంతమందా.. అంచనాలు ఎవరి వైపు!
టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తుంది.
By: Madhu Reddy | 24 Jun 2026 4:00 PM ISTటాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అయితే, 2027 సంక్రాంతి రేసు మాత్రం ఇప్పటి నుంచే మైండ్ బ్లాక్ చేస్తోంది. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్లు కొందరు తప్పుకుంటున్నా, కొత్తవాళ్లు వచ్చి చేరుతుండటంతో సినిమాల సంఖ్య అస్సలు తగ్గడం లేదు. మన స్టార్ హీరోలకే ప్లేస్ సరిపోదు అనుకుంటే, తమిళ స్టార్స్ కూడా 'మేము సైతం' అంటూ పండుగ బరిలోకి దిగుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈసారి మామూలు క్లాష్ ఉండేలా లేదు.
సీనియర్లంతా ఒక్కచోటే.. మతిపోతున్న లైన్ అప్:
2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తున్న మన సీనియర్ హీరోల ప్రాజెక్టుల వివరాలు చూస్తే పూనకాలు రావడం ఖాయం. మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పండుగ రేసులో ఉంది. అలాగే, నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ‘NBK 111’ పవర్‌ఫుల్ మూవీతో సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమా లేదా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్‌ను జనవరి 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండటంతో పండుగ వాతావరణం మరింత హీటెక్కింది.
'సంక్రాంతి డైరెక్టర్' అనిల్ రావిపూడి ఫిక్స్:
ఈ హెవీ కాంపిటీషన్‌లో ఎవరు వచ్చినా రాకపోయినా, విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం మాత్రం పక్కా అనిపిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్న ఈ ఫ్యామిలీ మల్టీస్టారర్ కోసం మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. గత కొన్ని ఏళ్లుగా వరుస సినిమాలతో సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్స్ కొట్టిన అనిల్ రావిపూడి, తనకున్న 'సంక్రాంతి డైరెక్టర్' అనే సెంటిమెంట్‌ను ఈసారి కూడా గట్టిగా వాడేలా ఉన్నాడు.
కోలీవుడ్ నుంచి వస్తున్న రజినీ, సూర్య:
టాలీవుడ్ స్టార్స్‌కే థియేటర్లు దొరకడం కష్టం అనుకుంటుంటే, తమిళనాడు నుంచి ఇద్దరు పెద్ద స్టార్స్ రేసులోకి వచ్చారు. రజినీకాంత్-సిబి చక్రవర్తి కాంబోలో, కమల్ హాసన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ధర్మన్' కూడా రేస్ లో వుంది. ఇక సూపర్ స్టార్ సినిమా అంటే తెలుగులోనూ భారీగా రిలీజ్ అవుతుంది. వీరితో పాటు 'వీరభద్రుడు' సినిమాతో 300 కోట్ల క్లబ్‌లో చేరి ఫుల్ ఫామ్‌లో ఉన్న సూర్య, జిత్తు మాధవన్ దర్శకత్వంలో చేస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీతో సంక్రాంతి బాక్సాఫీస్ పై కన్నేసినట్టు టాక్.
కుర్ర హీరోల స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రామాలు:
సీనియర్లతో పాటు యంగ్ హీరోలు కూడా సంక్రాంతి లక్‌ను పరీక్షించుకోనున్నారు. శర్వానంద్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ఈ రేసులో ఉండబోతోంది. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ కూడా 2027 సంక్రాంతికే షెడ్యూల్ అయింది. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ఇంతమంది స్టార్స్ ఒకేసారి థియేటర్ల మీదకు దండయాత్ర చేస్తే, అందరికీ స్క్రీన్స్ సర్దడం ఖచ్చితంగా పెద్ద టాస్కే. తీరా పండుగ దగ్గరపడేసరికి ఎంతమంది రేసులో మిగులుతారో చూడాలి. ఎవరెన్ని డౌట్లు పడినా, 2027 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మాత్రం సినీ ప్రియులకు అసలైన విందు భోజనంలా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
