సంక్రాంతి 2027 రేసు: కలగాపులగం కానున్న బాక్సాఫీస్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అంటే పండగ మాత్రమే కాదు. అది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే అతిపెద్ద గోల్డెన్ విండో.
By: Srikanth Kontham | 16 Jun 2026 5:03 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అంటే పండగ మాత్రమే కాదు. అది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే అతిపెద్ద గోల్డెన్ విండో. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా 2027 సంక్రాంతి రేసు అత్యంత ఆసక్తిక రంగా మారిపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి పాన్-ఇండియా స్టార్స్ వరకు అంతా జనవరి స్లాట్‌ను టార్గెట్ చేయడంతో థియేటర్ల వద్ద మునుపెన్నడూ లేని విధంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ సంక్రాంతి రేసులో అందరికంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి జెండాను పాతేశారు. `వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఈ పండగ బరిలో నిలవడం దాదాపు ఖరారైంది.
మెగాస్టార్ మార్క్ వింటేజ్ మాస్ ఎలిమెంట్స్, బాబీ పవర్‌ఫుల్ ఎలివేషన్లు తోడైతే పండగ పూట థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్ అంటే కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ఎంటర్‌టైనర్లకు కూడా ఇక్కడ పెద్ద పీట వేస్తారు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సరికొత్త చిత్రం సంక్రాంతి రేసును మరింత రసవత్తరంగా మార్చనుంది.
వీరితో పాటు టాలెంటెడ్ హీరో శర్వానంద్, సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా కూడా పండగ బరిలోనే నిలవనుండటంతో క్లాస్, కామెడీ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు బోలెడన్ని ఆప్షన్లు దొరికినట్లయింది. సాధారణంగా టాలీవుడ్ సంక్రాంతి రేసు అనగానే నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున సినిమాలు కచ్చితంగా లైన్లో ఉంటాయనేది ఇండస్ట్రీ సెంటిమెంట్. అయితే ఆ ఇద్దరు ఈసారి 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తమ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ మారడం ..థియేటర్ల లభ్యతను దృష్టిలో ఉంచుకుని సీనియర్ హీరోలు ఇద్దరూ తమ సినిమాలను వేరే సీజన్‌కు పోస్ట్‌పోన్ చేసుకునే యోచనలో ఉన్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
ప్రాంతీయ చిత్రాల హడావుడి ఇలా ఉంటే? బాక్సాఫీస్ వద్ద అసలైన ముప్పు పాన్-ఇండియా దిగ్గజాల రూపంలో పొంచి ఉంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ `టాక్సిక్` తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడిల కాంబినేషన్‌లో తెరకెక్కుతోనన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా `ఫౌజీ` కూడా ఇదే జనవరి విండోను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ రెండు భారీ పాన్-ఇండియా చిత్రాలు గనుక సంక్రాంతి రేసులోకి అధికారికంగా అడుగుపెడితే స్క్రీన్ల కేటాయింపు విషయంలో టాలీవుడ్‌లో పెద్ద యుద్ధమే జరగడం ఖాయం. మరో ఆరు నెలల ముందే సంక్రాంతి 2027 బాక్సాఫీస్ వాతావరణం కలగాపులగంగా మారిపోయింది. ఒకవైపు మెగాస్టార్ మాస్ పవర్, మరోవైపు వెంకీ-అనిల్ రావిపూడిల ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, వీటికి తోడు ప్రభాస్, యష్ ల పాన్-ఇండియా భారీతనం.. ఇలా అన్ని జోనర్లు ఒకేసారి ఢీకొట్టబోతున్నాయి. ఈ విపరీతమైన పోటీ వల్ల సినిమాల వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, ఎగ్జిబిటర్లు , డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది రాబోయే రోజుల్లో పెద్ద పరీక్షగా మారనుంది.
