మెగా-మాస్ పోటీ.. అనార్కలి నిలిచేనా?
2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ రానున్న నేపథ్యంలో చిన్న సినిమాలు విడుదల ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అయింది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:04 AMమెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు చిరంజీవి విశ్వంభర తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్వంభర సినిమా ఏ సమయంలో వచ్చినా చిరంజీవి తదుపరి సినిమా ను మాత్రం కచ్చితంగా 2026 సంక్రాంతికి విడుదల చేయడం కన్ఫర్మ్. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటుంది. కనుక సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం అనేది అసాధ్యం.
2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ రానున్న నేపథ్యంలో చిన్న సినిమాలు విడుదల ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ షాకింగ్‌గా మాస్ మహారాజా రవితేజ నుంచి 2026 సంక్రాంతికి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ ఏడాదిలో రవితేజ మాస్ జాతర సినిమాను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన వచ్చింది.
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో కేతిక శర్మ, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించబోతున్నారు. ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల చేయడం అనేది మంచి నిర్ణయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబో మూవీకి పోటీ అంటే కచ్చితంగా స్వయంగా తమ సినిమాను కిల్ చేసుకోవడమే అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా 2025 సంక్రాంతికి విడుదల అయ్యి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కారణంగా ఎంతగా నష్టపోయిందో మనకు తెలిసిందే.
ఆషికా రంగనాథ్, కేతిక శర్మలు హీరోయిన్‌లుగా నటించబోతున్న అనార్కలి సినిమాతో మాస్ మహారాజా మరోసారి తన మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు. అదే సమయంలో చిరంజీవి వింటేజ్ లుక్‌తో, పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో అనిల్ రావిపూడి సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్, అది కాకుండా సంక్రాంతికి ఆయన జోరు ముందు రవితేజ అనార్కలి నిలిచేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మద్య కాలంలో మంచి సినిమాలను కాస్త సేఫ్ జోన్‌లో విడుదల చేస్తేనే తప్ప వసూళ్లు వచ్చే పరిస్థితి లేదు. కనుక మినిమం గ్యాప్‌తో సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.