వరల్డ్ కప్ సూపర్ హీరో సంజు శాంసన్‌తో విందు
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో సభ్యుడైన సంజు శాంసన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
By: Sivaji Kontham | 11 March 2026 11:25 PM ISTఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో సభ్యుడైన సంజు శాంసన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఒక ఇన్ స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సంజు ఒక ప్రత్యేక విందులో పాల్గొని అభిమానులతో కలిసి భోజనం చేస్తూ సందడి చేశారు. తన వినయ విధేయతలతో అందరినీ ఆకట్టుకున్న సంజు.. వచ్చిన వారందరికీ సెల్ఫీలు ఇస్తూ వారిలో ఒకరిగా కలిసిపోయారు.
ఈ రోజు కోట్లాది మంది అభిమానం పొందుతున్న ఈ స్టార్ క్రికెటర్ ప్రయాణం పూల బాట ఏమీ కాదు. కేరళకు చెందిన సంజు శాంసన్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. కొడుకును ఎలాగైనా గొప్ప క్రికెటర్‌ని చేయాలని ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఢిల్లీలో సరైన అవకాశాలు రాకపోవడంతో తన ఉద్యోగానికి ముందస్తు పదవీ విరమణ (వీఆర్ఎస్) ఇచ్చి మరీ సంజుని కేరళకు తీసుకువెళ్లారు.
బాల్యంలో సంజు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉండేవని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఢిల్లీ వంటి మెట్రో నగరం నుంచి కేరళకు మారిన తర్వాత అక్కడి వాతావరణానికి, భాషకు అలవాటు పడటం సంజుకి పెద్ద సవాలుగా మారింది. అయినా వెనకడుగు వేయకుండా తిరువనంతపురంలోని లోకల్ గ్రౌండ్స్‌లో కఠినమైన శిక్షణ తీసుకుంటూ తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నారు.
కేరళ క్రికెట్ అసోసియేషన్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు చూపే చురుకుదనం అందరినీ ఆశ్చర్యపరిచేది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి ప్రవేశించాక అతని దశ తిరిగింది. ఒక సాధారణ కేరళ కుర్రాడు ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎదగడం వెనుక ఏళ్ల తరబడి పడ్డ కష్టం, పట్టుదల ఉన్నాయి. ఎందరో యువ క్రికెటర్లకు నేడు సంజు ఒక ఇన్ స్పిరేషన్.
సంజు శాంసన్ గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం అతని మనస్తత్వం. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, బయట అంత ప్రశాంతంగా ఉంటాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత అతని డిమాండ్ మరింత పెరిగింది. ఆటలో ఒడిదుడుకులు ఎదురైనా.. జట్టులో చోటు దక్కకపోయినా నిరాశ చెందకుండా తన వంతు కోసం వేచి చూసే సంజు లక్షణం అతడిని `సూపర్ హీరో`గా నిలబెట్టింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సంజుని చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానులతో కలిసి సాధారణ విందులో పాల్గొంటూ వారి ప్రేమాభిమానాలను అందుకుంటున్న సంజు శాంసన్ నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ షిప్‌కు నిదర్శనం. కష్టాలను ఎదురించి నిలబడితే విజయం వరిస్తుందని చెప్పడానికి సంజు జీవితమే ఒక ఉదాహరణ.
