వరలక్ష్మికి డైరెక్టర్ సారీ.. ఇప్పుడు ఇలా అన్నారేంటి మళ్లీ?
నటి వరలక్ష్మి శరత్‌కుమార్, దర్శకుడు సంజీవ్ మేగోటి మధ్య నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
By: M Prashanth | 15 Jun 2026 10:58 AM ISTనటి వరలక్ష్మి శరత్‌కుమార్, దర్శకుడు సంజీవ్ మేగోటి మధ్య నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా సారీ చెప్పి వివాదానికి ముగింపు పలికినట్లు కనిపించిన ఆ వ్యవహారం, సంజీవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన మాటల్లో పర్సనల్ కామెంట్స్ కంటే సినిమా కోసం పడిన ఆవేదనే ఎక్కువగా కనిపించడం గమనార్హం.
వరలక్ష్మి, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో తెరకెక్కిన పోలీస్ కంప్లైంట్ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ల విషయంలో వివాదం మొదలైంది. సినిమా ప్రమోషన్స్ కు వరలక్ష్మీ రావడం లేదని, పారితోషికం తీసుకున్నప్పటికీ డబ్బింగ్ ను బాగా లేట్ చేసి తమను ఇబ్బందులకు గురిచేశారని సంజీవ్ ఆరోపించారు. ఆ కామెంట్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి.
అయితే వరలక్ష్మి తనవైపు నుంచి స్పందిస్తూ, సినిమా అవసరమైన ప్రతిసారి టీమ్ కు అండగా నిలిచానని స్పష్టం చేశారు. తాను ఇప్పటికే కొన్ని ఈవెంట్లకు హాజరయ్యానని, అందరిలా కామెంట్స్ వార్ లో పాల్గొననని తెలిపారు. "అరిచే కుక్కలు కరవడం చాలా అరుదు. నేను అరవను.. కరుస్తా" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం "నిజమే గెలుస్తుంది" అంటూ సంజీవ్ క్షమాపణలు చెబుతున్న వీడియో షేర్ చేశారు.
ఆ వ్యవహారం తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పెద్దల జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే తాజాగా సంజీవ్ మేగోటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. "నిజం చెప్పాలంటే క్షమాపణలు చెప్పేంత తప్పు నేను చేయలేదు. సినిమా పట్ల ఉన్న బాధతో మాట్లాడాను. కానీ పెద్దలు సారీ చెప్పమంటే చెప్పాను. ఆమె వ్యక్తిగతంగా నష్టపోతారని, ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని సూచించడంతో వారి మాటను గౌరవించాను" అని ఆయన వివరించారు.
అంతేకాదు, వరలక్ష్మి ప్రొఫెషనల్ డెడికేషన్ ను కూడా సంజీవ్ ప్రశంసించారు. షూటింగ్ సమయంలో ఆమె ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేదని, టైమ్ డిసిప్లైన్ పాటించేవారని చెప్పారు. నిర్ణయించిన సమయానికి ముందుగానే సెట్స్ కు వచ్చేవారని వెల్లడించారు. షూటింగ్ లో గాయపడి వేలు విరిగినా, వైద్యులు సూచించిన రెస్ట్ ను పక్కన పెట్టి తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆమె చూపిన డెడికేషన్ ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.
అయితే తాను సారీ చెప్పిన వీడియోను మాత్రమే నెట్టింట పోస్ట్ చేయడం చేయడం తనను బాధించిందని సంజీవ్ అన్నారు. వరలక్ష్మి తన గురించి మాట్లాడిన చిన్న బైట్ కూడా ప్రజలకు చూపించి ఉంటే సినిమా కోసం ఇరువురూ రాజీ పడిన విషయం ప్రేక్షకులకు అర్థమయ్యేదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఇప్పుడు వివాదంలో పర్సనల్ క్లాష్ కంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు ప్రశంసలు వినిపించడం ద్వారా వరలక్ష్మి-సంజీవ్ మధ్య రిలేషన్ పూర్తిగా దెబ్బతినలేదని అర్థమవుతోంది. సినిమా కోసం కలిసి పనిచేసిన ఇద్దరూ టాలెంట్ ను గుర్తిస్తూనే, కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
