500 మంది వెయిటింగ్.. ముంబైలో షూట్ వర్షార్పణం
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే, దానికి రోజువారీ బడ్జెట్ టూమచ్ కాస్ట్‌లీగా ఉంటుంది.
By: Tupaki Desk | 29 May 2025 12:46 PM ISTబాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే, దానికి రోజువారీ బడ్జెట్ టూమచ్ కాస్ట్‌లీగా ఉంటుంది. ఇంతకుముందు రామ్ లీలా, దేవదాస్, పద్మావత్, గంగూభాయి కథియావాడీ, హీరామండి వంటి చిత్రాల కోసం అతడు భారీ సెట్లను నిర్మించి వాటిలో చిత్రీకరణలు చేసాడు. ఒక్కోసారి లైవ్ లొకేషన్ లోను వందలాది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ చేయడం ఆయనకు రివాజు. భారీ తనం నిండిన ప్రాపర్టీలో సన్నివేశాల్ని భారీగా తెరకెక్కిస్తారు గనుక ఇది అవసరం.
ఇప్పుడు అలాంటి ఓ సన్నివేశంలో అతడి `లవ్ అండ్ వార్` షూటింగ్ మొత్తం వర్షార్పణం అయింది. ముంబైలో ప్లాన్ చేసిన షెడ్యూల్ అనూహ్యంగా వర్షం కారణంగా డిస్ట్రబ్ అయింది. దాదాపు 500 మంది షూట్ లో పాల్గొనాల్సి ఉండగా, లొకేషన్ పూర్తిగా నీట మునకలేసింది. లోకల్ ట్రైన్స్ లో లొకేషన్ కి చేరాల్సిన వారంతా ఎక్కడికక్కడ బంద్ అయిపోయారు. దీంతో చాలా మంది షూటింగుకి రాకపోవడం, పైగా వారి బాగోగులు, రక్షణ దృష్ట్యా కూడా సంజయ్ లీలా భన్సాలీ షూటింగుని నిలిపి వేయడం చర్చనీయాంశమైంది. ముంబైలో గత కొద్దిరోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు కూడా బంద్ అయిపోయాయి.
రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో భన్సాలీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో భారీ సన్నివేశాలకు కొదవేమీ లేదు. భన్సాలీ మార్క్ కళాత్మకతకు లోటు ఉండదని తెలిసింది. కానీ ఇలా వర్షాలు, వరదలు అతడికి అంతరాయం కలిగిస్తున్నాయి. అయినా రాజీ అన్నదే లేని ఈ ప్రముఖ దర్శకుడు షూటింగ్ ని నిలిపివేసారు. వర్షం తగ్గిపోయి సాధారణ పరిస్థితి వచ్చాకే షూటింగ్ చేయాలని అతడు భావిస్తున్నట్టు తెలిసింది. 2026 మార్చిలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అవసరం మేర ప్రధాన తారాగణం భన్సాలీకి అన్నివిధాలా సహకరిస్తున్నారు. అయితే ప్రకృతి విపత్తుల వేళ ఎవరూ ఏమీ చేయలేరు. దీనిని అందరూ అర్థం చేసుకుని భన్సాలీకి సహకరిస్తున్నారని తెలిసింది. గంగూభాయి కథియావాడీ, హీరామండి లాంటి భారీ ప్రాజెక్టుల తర్వాత భన్సాలీ ఇప్పుడు లవ్ అండ్ వార్ ని అంతే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
