నిర్మాత ఇద్దరు భార్యల మధ్య సఖ్యతకు పరేషాన్
ఇంటర్వ్యూలో ప్రియా తాను సంజయ్‌ను ఎలా కలిసారో.. అతడి మునుపటి వివాహాల నుండి జన్మించిన పిల్లల కారణంగా తామంతా ఎలా మిశ్రమ కుటుంబంగా మారాము అన్నది మాట్లాడారు.
By: Tupaki Desk | 25 Jun 2025 7:26 PM ISTలండన్ లో పోలో ఆడుతూ తేనెటీగను మింగిన ఘటనలో శ్వాస ఆడక చివరికి ప్రముఖ నటుడు, నిర్మాత సంజయ్ కపూర్ స్పాట్ లోనే మరణించిన సంగతి తెలిసిందే. అతడిని బతికించేందుకు యూకే పోలీసులు చాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇంతకుముందు వైరల్ అయింది. సంజయ్ సంస్మరణ సభలో అతడి భార్యలు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
అయితే సంజయ్ కపూర్ మరణానంతరం అతడి ప్రస్తుత భార్య పిల్లలతో, మాజీ భార్య కరిష్మా కపూర్, ఆమె పిల్లల సమీకరణం ఎలా ఉంది? వారి మధ్య సఖ్యత ఎంత? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగింది. ఇంతకుముందు శ్రద్ధాంజలి సమావేశంలో సంజయ్ మూడో భార్య ప్రియా సచ్ దేవ్, మొదటి భార్య కరిష్మా ఒకే వేదికపై అన్యోన్యంగానే కనిపించారు. ఇప్పుడు అతడి మూడవ భార్య ప్రియా సచ్‌దేవ్ పాత ఇంటర్వ్యూ మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ఇంటర్వ్యూలో ప్రియా తాను సంజయ్‌ను ఎలా కలిసారో.. అతడి మునుపటి వివాహాల నుండి జన్మించిన పిల్లల కారణంగా తామంతా ఎలా మిశ్రమ కుటుంబంగా మారాము అన్నది మాట్లాడారు. అలాగే కరిష్మా కపూర్ ను సంజయ్ సాంప్రదాయ వివాహం చేసుకోలేదని కూడా ప్రియా తెలిపారు. ``సంజయ్ మునుపటి వివాహం సాంప్రదాయ వివాహం కాదు. ఆ వివాహం నుండి అతనికి ఇద్దరు అందమైన పిల్లలు ఉన్నారు. మేము వారిని చాలా ప్రేమిస్తున్నాము. ఈ రోజు మేము ఒక అందమైన మిశ్రమ కుటుంబం`` అని అన్నారు.
అయితే 2016లో విడాకుల సమయంలో సంజయ్ - కరిష్మా జంట ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపించుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవలయ్యాయి. సంజయ్ గృహ హింసకు పాల్పడ్డాడని కరిష్మా కపూర్ ఆరోపించగా, సంజయ్ డబ్బు కోసమే తనను కరిష్మా వివాహం చేసుకుందని ప్రత్యారోపణలు చేసాడు. అయితే కరిష్మా తండ్రి, ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ ఈ వివాహాన్ని తాను తిరస్కరించానని చాలాసార్లు చెప్పారు. సంజయ్ మూడో క్లాస్ వ్యక్తి అని, అందరికీ తమ అర్హతలు తెలుసునని, తాము కపూర్లం అని అన్నారు. మేము ఎవరి డబ్బు కోసమో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మాకు డబ్బు మాత్రమే కాదు.. మా ప్రతిభ మా జీవితాంతం మాకు మద్దతు ఇవ్వగలదు. కరిష్మా అతడిని వివాహం చేసుకోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అతను ఎలా ఉంటాడో మొత్తం ఢిల్లీకి తెలుసు. ఇంతకంటే ఎక్కువ చెప్పదలచుకోలేదు`` అని దూషించారు.
