సినీ నిర్మాత అంత్యక్రియల ఆలస్యానికి కారణం?
సంజయ్ మరణించిన సమయంలో లండన్‌లో ఉన్నారు. ఆయన అమెరికా పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాల కారణంగా అంత్యక్రియల ప్రక్రియలో ఆలస్యం జరిగింది.
By: Tupaki Desk | 19 Jun 2025 11:21 AM ISTమైదానంలో పోలో ఆడుతూ తేనెటీగను మింగిన బిజినెస్‌మేన్ కం సినీనిర్మాత, నటుడు సంజయ్ కపూర్ (53) అది గొంతులో కుట్టడంతో అలెర్జీ కారణంగా శ్వాస ఆడక, చివరికి గుండె నొప్పితో మృతి చెందిన సంగతి తెలిసిందే. సీనియర్ కథానాయిక కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్... వారి మధ్య విడాకుల తర్వాత కూడా సత్సంబంధాలున్నాయి.
తాజా సమాచారం మేరకు.. చట్టపరమైన చిక్కుల కారణంగా లండన్ నుండి ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ఆలస్యం కావడంతో సంజయ్ కపూర్ అంత్యక్రియలు జూన్ 19 గురువారం న్యూఢిల్లీలో జరుగుతాయి. ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశాన వాటికలో సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతని కుటుంబం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
సంజయ్ మరణించిన సమయంలో లండన్‌లో ఉన్నారు. ఆయన అమెరికా పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాల కారణంగా అంత్యక్రియల ప్రక్రియలో ఆలస్యం జరిగింది. ఆయన భౌతికకాయాన్ని భారతదేశానికి తీసుకురావడానికి అదనపు డాక్యుమెంటేషన్, అధికారిక విధానాలు అవసరమని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. జూన్ 22న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య సంతాప సభ జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రముఖ ఆటో కాంపోనెంట్ తయారీదారు సోనా కామ్‌స్టార్‌కు సంజయ్ కపూర్ చైర్మన్. అతడు 10,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అతడు ఉత్సాహభరితమైన పోలో ఆటగాడు.. మైదానంలో మ్యాచ్‌లలో పాల్గొనేవాడు. సంజయ్ కపూర్ ప్రస్తుతం తన మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తో సాహచర్యంలో ఉన్నాడు. కరిష్మాకు ఇద్దరు పిల్లలు కాగా, ప్రియాకు మరో ఇద్దరు వారసులు ఉన్నారు.
