భర్త అంత్యక్రియల్లో నటి ఎమోషనల్.. పిల్లలు కంటతడి!
కరిష్మా కపూర్ తన పిల్లలు సమైరా, కియాన్‌లతో కలిసి ఢిల్లీకి ప్రయాణమై సంజయ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 20 Jun 2025 1:55 PM ISTలండన్‌లో గుండెపోటుతో మరణించిన వ్యాపారవేత్త, సినీనిర్మాత సంజయ్ కపూర్ పార్థీవ దేహం చట్టపరమైన కారణాలతో భారతదేశానికి రావడం ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని లోధి రోడ్డు శ్మశాన వాటికలో జరిగాయి. ఈ అంతిమ సంస్కారాల గురించి బుధవారం ఆయన కుటుంబం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
కరిష్మా కపూర్ తన పిల్లలు సమైరా, కియాన్‌లతో కలిసి ఢిల్లీకి ప్రయాణమై సంజయ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కరీనా కపూర్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్ కూడా ముంబై విమానాశ్రయం నుండి అంత్యక్రియలకు హాజరు కావడానికి బయలుదేరిన ఫోటోలు వీడియోలు కూడా అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. వేడుకలో భావోద్వేగానికి గురైన కరిష్మా కపూర్ తన పిల్లలను ఓదార్చుతున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కరిష్మా సంజయ్ కు మొదటి భార్య. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబం దివంగత వ్యాపారవేత్తకు హృదయపూర్వకంగా వీడ్కోలు పలికింది. పిల్లలు సమైరా, కియాన్‌లతో కలిసి కరిష్మా తుది నివాళులర్పించారు. కరిష్మా భావోద్వేగానికి గురైన సమయంలో కరీనా-సైఫ్ తనకు అండగా నిలిచారు.
అంత్యక్రియల సమయంలో కరిష్మా కుమారుడు కియాన్ తీవ్ర నిరాశకు గురవుతూ కనిపించాడు. పిల్లలు విలపిస్తున్న వీడియో వైరల్ అయింది. జూన్ 22 ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ప్రార్థన సమావేశం జరుగుతుంది. సంజయ్ కపూర్ తల్లి రాణి సురీందర్ కపూర్, అతడి భార్య ప్రియా సచ్ దేవ్, వారి పిల్లలు సఫీరా, అజారియాస్ ఈ నోట్ ని రిలీజ్ చేయగా, ప్రార్థనా సమావేశ పత్రికలో కరిష్మా కపూర్ సహా అతడి పిల్లల పేర్లను ప్రస్థావించడం గమనార్హం.
కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ జూన్ 12న ఇంగ్లాండ్‌లో మరణించినట్టు వార్తలు వచ్చాయి. అతడు గ్రౌండ్ లో పోలో ఆడుతున్న సమయంలో తేనెటీగను మింగడంతో అది గొంతు నాళాన్ని పట్టి కరిచింది. దాంతో శ్వాస ఆడక గుండెపోటు వచ్చి మరణించారని కథనాలొచ్చాయి. అయితే మరణానికి గల కారణాలపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.
