Begin typing your search above and press return to search.

తీరు మారాల్సిందే.. సంజయ్‌ దత్‌ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలతో పాటు సౌత్ సినిమాల్లోనూ అధికంగా నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   11 July 2025 10:59 AM IST
తీరు మారాల్సిందే.. సంజయ్‌ దత్‌ సంచలన వ్యాఖ్యలు
X

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలతో పాటు సౌత్ సినిమాల్లోనూ అధికంగా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోగా సినిమాలు చేసిన సంజయ్‌ దత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద ఈయన ఎన్నో రికార్డ్‌లను నెలకొల్పాడు. అప్పట్లో హిందీలో మాత్రమే సినిమాలు చేసిన సంజయ్‌ దత్ ఇప్పుడు సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కేజీఎఫ్‌ సినిమాలో సంజయ్‌ దత్‌ విలనిజంకు అంతా ఫిదా అయ్యారు. సంజయ్ దత్‌ సౌత్‌ లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు.

తాజాగా కన్నడ మూవీ 'కేడీ - ది డెవిల్‌' సినిమాలో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం సౌత్ ఇండియా వచ్చిన సంజయ్‌ దత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారినప్పుడు మాత్రమే సక్సెస్‌లు అందుకుంటాము. సౌత్‌ ఇండియన్‌ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పులను అన్ని భాషల వారు ఆచరించాల్సిందే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌ గతంతో పోల్చితే చాలా మిస్‌ అవుతుంది. అక్కడ కేవలం అంకెల చుట్టూ సినిమాలు తిరుగుతున్నాయి. మూస పద్దతిని పక్కన పెట్టకుండా, ఇంకా కొన్ని విషయాలను పట్టుకుని ఉంటే ఖచ్చితంగా నష్టం మరింత పెద్దగా ఉంటుందని సంజయ్ దత్‌ హెచ్చరించాడు.

బాలీవుడ్‌ లో ఒకప్పుడు తాను ధర్మేంద్ర, అమితాబ్‌ బచ్చన్‌, సంజీవ్‌ కుమార్‌, దిలీప్ కుమార్‌లతో కలిసి పని చేశాను. అప్పటి కథ, స్క్రీన్‌ప్లేలు ఇప్పటి రోజుల్లో పని చేయక పోవచ్చు. కానీ అప్పటి మాదిరిగా మంచి కథ, స్క్రిప్ట్‌ ఉండాల్సిన అవసరం ఉందని సంజయ్‌ దత్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పట్లో సినిమాలో నటించే ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మంచి ఔట్‌ పుట్‌ వచ్చేది అన్నాడు. ప్రస్తుత రోజుల్లో స్క్రిప్ట్‌ కు బదులుగా నెంబర్ తో సినిమాను తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంకెల గారడీ చేయడం ద్వారా సినిమాను హిట్‌ చేయాలి అనుకోవడం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంజయ్‌ దత్‌ గతంలోనూ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ పై అసహనం వ్యక్తం చేశాడు. వరుసగా అక్కడ పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ముందు ముందు అయినా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన మాటలను హిందీ ఫిల్మ్‌ మేకర్స్ కనీసం పరిగణలోకి తీసుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి. కేవలం సంజయ్ దత్‌ మాత్రమే కాకుండా చాలా మంది సీనియర్‌లు ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. హిందీ సినిమా బాగు పడాలి అంటే ఆ పద్ధతి మారాలి అంటూ చాలా మంది బాహాటంగానే చెబుతున్నారు. కానీ బాలీవుడ్‌లో సౌత్ ఇండస్ట్రీలో ఉన్నట్లుగా పరిస్థితులు లేవు. అందుకే అక్కడ సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకు సందిగ్ధంలో పడుతున్నట్లు అనిపిస్తుంది.