Begin typing your search above and press return to search.

ప్రముఖ నటి ఇంట్లో చోరీ, ఏం పోయాయంటే..!

1980లో మిస్ ఇండియా యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుని, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటి సంగీతా బిజ్లానీ.

By:  Tupaki Desk   |   19 July 2025 3:30 PM IST
ప్రముఖ నటి ఇంట్లో చోరీ, ఏం పోయాయంటే..!
X

1980లో మిస్ ఇండియా యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుని, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటి సంగీతా బిజ్లానీ. ఈమె గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటుంది. మూడు దశాబ్దాలుగా సినిమాలు ఏమీ చేయడం లేదు. ఈమె టీం ఇండియా మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్న బిజ్లానీ ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. ఇన్నాళ్ల తర్వాత సంగీతా బిజ్లానీ వార్తల్లో నిలిచారు. పుణె జిల్లా మావల్‌ సమీపంలోని టికోణా పేట్‌ ప్రాంతంలో ఉండే బిజ్లానీ ఇంట్లో దొంగలు పడటం చర్చనీయాంశం అయింది.

సిటీకి దూరంగా ఉండే ఆ ఇంటికి బిజ్లానీ, అజారుద్దీన్‌ అరుదుగా వెళ్తూ ఉంటారు. మార్చి నుంచి మొన్నటి వరకు వెళ్లలేదు. అక్కడ సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండరు. దాంతో వెనుక నుంచి దొంగలు మెష్‌ డోర్‌ను కట్‌ చేసి ఇంట్లోకి దూరి, టీవీతో పాటు, ఖరీదైన సామాను దొంగిలించారు. ఇంట్లో ఉన్న దాదాపు రూ.50 వేలను సైతం ఎత్తుకు వెళ్లారట. బిజ్లానీ సన్నిహితులు ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి డబ్బు, టీవీ, ఇతర వస్తువులు దొంగతనం చేశారు అంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకు వెళ్లడంతో పాటు, అక్కడ ఉన్న కొన్ని వస్తువులను ఉద్దేశ్యపూర్వకంగా పగులగొట్టారు. అంతే కాకుండా ఇంటిని ఇష్టానుసారంగా పాడు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఇది దొంగలు చేసిందా లేదంటే తెలిసిన వారు కావాలని చేసిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకుని వేలు ముద్రలు తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దొంగతనం కేసును ఛేదిస్తామని స్థానిక పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడిన సమయంలో చెప్పుకొచ్చారట. ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని పోలీసులు సరిగ్గా అంచనా వేయలేక పోతున్నారు.

మార్చి 7 నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉంటుందట. అప్పటి నుంచి మధ్యలో ఎవరూ కూడా అటు వైపు వెళ్లి చూడలేదు. దాంతో ఎప్పుడు ఆ దొంగతనం జరిగి ఉంటుంది అనేది తెలియడం లేదు. మార్చి 7 నుంచి జులై 18 మధ్యలో ఎప్పుడు అయినా ఆ దొంగతనం జరిగి ఉండవచ్చు. సరైన సమయం, డేట్‌ లేకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజ్‌లను చూసే పరిస్థితి లేదని పోలీసు వర్గాల వారు అంటున్నారట. వేలు ముద్రలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో దాదాపుగా నగదు, సామాను కలిపి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు చోరి అయినట్లుగా ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్నారు. ఈ విషయమై సంగీతా బిజ్లానీ కానీ, ఆమె భర్త అజారుద్దీన్‌ కానీ స్పందించాల్సి ఉంది.