Begin typing your search above and press return to search.

'కబీర్ సింగ్' నటుడికి గట్టిగా ఇచ్చిన సందీప్ రెడ్డి

ఎన్నో అవార్డ్ సినిమాల్లో, హిట్ మూవీస్‌లో నటించిన అడిల్.. ఇన్నేళ్ల తన కెరీర్లో తాను ఎందుకు చేశానా అని పశ్చాత్తాపం చెందే ఒకే ఒక్క చిత్రం 'కబీర్ సింగ్' అని వ్యాఖ్యానించాడు అడిల్.

By:  Tupaki Desk   |   18 April 2024 11:34 AM GMT
కబీర్ సింగ్ నటుడికి గట్టిగా ఇచ్చిన సందీప్ రెడ్డి
X

'అర్జున్ రెడ్డి'తో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాక బాలీవుడ్‌కు వెళ్లి 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో మరింతగా సంచలనం రేపాడు సందీప్ రెడ్డి వంగ. ఈ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. కానీ ఈ రెండు చిత్రాల చుట్టూ వివాదాలు తక్కువేమీ కాదు. రెండు సినిమాల్లోనూ హీరోల పాత్రల చిత్రణ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

బయటి వాళ్లే కాక సినీ జనాలు సైతం ఈ చిత్రాలను తప్పుబట్టారు. 'యానిమల్' విషయంలో అయితే సందీప్ రెడ్డి.. జావెద్ అక్తర్ సహా చాలామందితో సోషల్ మీడియాలో దిగిన పరిస్థితి. 'యానిమల్' తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతుండగా.. 'కబీర్ సింగ్' విషయంలో అందులో నటించిన అడిల్ హుస్సేన్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్నో అవార్డ్ సినిమాల్లో, హిట్ మూవీస్‌లో నటించిన అడిల్.. ఇన్నేళ్ల తన కెరీర్లో తాను ఎందుకు చేశానా అని పశ్చాత్తాపం చెందే ఒకే ఒక్క చిత్రం 'కబీర్ సింగ్' అని వ్యాఖ్యానించాడు అడిల్. ఆ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో కనిపించాడు అడిల్.

ఐతే ఈ చిత్రం కోసం తనను సంప్రదించినపుడు నటించడానికి పెద్దగా ఇష్టపడలేదని.. ఎక్కువ డబ్బులు అడిగితే వాళ్లే ఊరుకుంటారని తన మేనేజర్‌తో చెప్పానని.. కానీ అడిగిన పారితోషకం ఇచ్చి తనను నటింపజేశారని అడిల్ చెప్పాడు. ఐతే తన మిత్రుడితో కలిసి సినిమాకు వెళ్లిన తాను మధ్యలోనే బయటికి వచ్చేశానని.. ఇలాంటి సినిమాలో నటించినందుకు తిడుతుందేమో అని తన భార్యను కూడా ఆ సినిమా చూడనివ్వలేదని చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో అడిల్.

ఈ వీడియో సందీప్ దృష్టికి వచ్చింది. అడిల్ నటించిన 30 ఆర్ట్ సినిమాలతో రాని గుర్తింపు ఒక్క బ్లాక్‌బస్టర్ మూవీతో వచ్చిందని.. ఇలాంటి నటుడిని కాస్ట్ చేసుకున్నందుకు ఇప్పుడు తాను పశ్చాత్తాపం చెందుతున్నానని.. తనకు ప్యాషన్ కంటే అత్యాశ ఎక్కువని అర్థమైందని.. ఏఐ సాయంతో అతడి ముఖాన్ని సినిమాలో మార్చేస్తానని.. అప్పుడు సిగ్గు పడాల్సిన అవసరం ఉండదని గట్టిగా రిటార్ట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి.