ట్రెండీ టాక్: ఈ దర్శకుడి చేతిలో పడితే ఖతమ్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఓ దర్శకుడి పేరు మార్మోగుతోంది... అతడు ది గ్రేట్ సందీప్ రెడ్డి వంగా. అతడి సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ఎంత రఫ్ గా ఉంటుందో.. హీరోయిన్ల పాత్రలు అంత ఇంటెన్సిటీతో ఉంటాయి.
By: Sivaji Kontham | 2 March 2026 1:00 AM ISTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఓ దర్శకుడి పేరు మార్మోగుతోంది... అతడు ది గ్రేట్ సందీప్ రెడ్డి వంగా. అతడి సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ఎంత రఫ్ గా ఉంటుందో.. హీరోయిన్ల పాత్రలు అంత ఇంటెన్సిటీతో ఉంటాయి. అందుకే `ఈ దర్శకుడి చేతిలో పడితే హీరోయిన్లు ఖతమ్` అనే మాట వినిపిస్తుంది. అయితే ఇది నెగెటివ్ సెన్స్ లో కాదు.. పాజిటివ్ సెన్స్ లో.. అతడి దర్శకత్వంలో నటిస్తే ఆ కథానాయిక కెరీర్ రేంజ్ అమాంతం మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సందీప్ వంగా సృష్టించిన `అర్జున్ రెడ్డి` పాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రభంజనం షాలిని పాండే జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమా రాకముందు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు.. కానీ ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి.. ప్రస్తుతం బాలీవుడ్ వరకు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇక హిందీలో `కబీర్ సింగ్` సినిమాతో కియారా అద్వాణీకి సందీప్ ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చారు. అప్పటికే కియారా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయినా కానీ.. సందీప్ తన నుంచి రాబట్టిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కియారాలోని ఎమోషనల్ పెర్ఫామర్‌ను సందీప్ వంగా ప్రపంచానికి పరిచయం చేశారనడంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమా తర్వాతే ఆమె బాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. సందీప్ తన సినిమాల్లో హీరోయిన్ల నుంచి కొత్త ఎక్స్‌ప్రెషన్స్, సహజమైన నటనను రాబట్టడంలో సిద్ధహస్తుడని కియారా పాత్రే నిరూపించింది.
గతేడాది వచ్చిన `యానిమల్` సినిమా సందీప్ సత్తాను మరోసారి చాటింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న నటన చూసి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. కూర్గ్ బ్యూటీలోని అసలైన నటిని సందీప్ బయటకు తీశాడని ప్రశంసలు కురిసాయి. అయితే, అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం త్రిప్తి దిమ్రీ. కేవలం 15-20 నిమిషాల పాత్రతోనే ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది. సినిమా విడుదలైన ఓవర్ నైట్‌లోనే త్రిప్తి సోషల్ మీడియా ఫాలోయింగ్ మిలియన్లలో పెరిగింది. `నేషనల్ క్రష్`గా మారిపోయిన త్రిప్తికి ఇప్పుడు బాలీవుడ్‌లో వరస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సందీప్ ఛాయిస్ ఎంత పవర్‌ఫుల్ గా ఉంటుందో ట్రిప్తి సక్సెస్ ఒక ఉదాహరణ.
ఇప్పుడు సందీప్ వంగా తన తదుపరి చిత్రం `స్పిరిట్` (ప్రభాస్ హీరో) కోసం ఐశ్వర్య దేశాయ్ అనే కొత్త నటిని ఎంపిక చేసి మళ్ళీ వార్తల్లో నిలిచారు. నిన్న విడుదలైన పోస్టర్‌లో ఈ కొత్త భామను చూడగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఐశ్వర్య దేశాయ్ కర్ణాటకకు చెందిన మోడల్. ఆమె బెంగళూరులో చదువుకుంది. మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఐశ్వర్య కొన్ని కన్నడ ప్రాజెక్టులలో కూడా మెరిసింది. తన కుటుంబ నేపథ్యం సాధారణమైనదే అయినా.. తనదైన అందం, అభినయంతో సందీప్ దృష్టిని ఆకర్షించింది.
ఐశ్వర్య దేశాయ్ ఆస్తులు, వ్యక్తిగత వివరాల గురించి సోషల్ మీడియాలో రకరకాల సెర్చ్‌లు జరుగుతున్నాయి. ఈ బ్యూటీ ఒక సుశిక్షితమైన డాన్సర్.. ఫిట్‌నెస్ ఫ్రీక్. `స్పిరిట్` కంటే ముందు కొన్ని లఘు చిత్రాలు, కమర్షియల్ యాడ్స్‌లో నటించిన ఐశ్వర్యకు... ప్రభాస్ సరసన ఛాన్స్ రావడం అంటే అది సందీప్ వంగా ఇచ్చిన అరుదైన గిఫ్ట్ అని చెప్పాలి. సందీప్ సినిమాల్లో హీరోయిన్ల సెలక్షన్ ఎప్పుడూ ఒక మిస్టరీలా ఉంటుంది కానీ... అది ఒకసారి రివీల్ అయ్యాక ఆ నటి కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకడం ఖాయం.
మొత్తానికి షాలిని పాండే నుంచి ఐశ్వర్య దేశాయ్ వరకు సందీప్ వంగా మార్క్ హీరోయిన్ల ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. ఒక నటిలో ఉన్న స్పార్క్‌ను గుర్తించి వారిని వెండితెరపై ఎలా ఆవిష్కరించాలో తెలిసిన దర్శకుడు కావడంతో యువ నటీమణులంతా సందీప్ సినిమాలో ఒక్క చిన్న రోల్ దొరికినా చాలని ఆశపడుతున్నారు. ఐశ్వర్య దేశాయ్ కి కూడా `స్పిరిట్` విడుదలైతే త్రిప్తి దిమ్రీ రేంజ్ సక్సెస్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
