'యానిమల్' సీక్వెల్ లాంచింగ్ ఎప్పుడో తెలుసా?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన `యానిమల్` ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.
By: Sivaji Kontham | 5 Feb 2026 9:41 AM ISTసందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన `యానిమల్` ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 918 కోట్లు వసూలు చేసి ఆ ఏడాది అత్యుత్తమ చిత్రంగా రికార్డులు బ్రేక్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికే రెండేళ్లయింది. 2023 డిసెంబర్ లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఆరునెలలకు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయినా ఇప్పటికీ ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో స్పష్ఠత లేదు. దీనికి కారణం సందీప్ వంగా, రణబీర్ కపూర్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే.
సందీప్ వంగా ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ ని మెప్పించే కాప్ యాక్షన్ డ్రామాకు వంగా స్టైల్ ఎమోషన్స్, రగ్డ్ కాప్ యాటిట్యూడ్ ని జోడించి తెరపై మ్యాజిక్ చేయబోతున్నారని సమాచారం. మరోవైపు రణబీర్ కపూర్ రామాయణం ఫ్రాంఛైజీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. రామాయణం 1, రామాయణం 2 చిత్రాలకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు విడుదలైన టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. అయితే సందీప్ , రణబీర్ ఇద్దరూ అన్ని పనుల్ని పూర్తి చేసుకుని యానిమల్ పార్క్ (యానిమల్ 2) కోసం 2027లో ఒకరికొకరు అందుబాటులోకి వస్తారని తాజాగా తెలిసింది.
చాలా కాలంగా అభిమానుల్లో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ గురించి చాలా చర్చ సాగుతోంది. అంతకంతకు ఆలస్యం అవుతుండటంతో రణబీర్ ఫ్యాన్స్ లో కొంత అసహనం నెలకొంది. ఇంతలోనే ఇప్పుడు సందీప్ వంగా స్వయంగా సీక్వెల్ గురించిన అప్ డేట్ చెప్పారు. అతడి ప్రకారం.. యానిమల్ పార్క్ షూటింగ్ 2027 జూన్ లేదా జూలై నాటికి పట్టాలెక్కే అవకాశం ఉంది. మొదటి భాగం క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చినట్లుగా, ఈ సీక్వెల్‌లో రణ్‌విజయ్ సింగ్ (రణబీర్ కపూర్).. అతడి పోలికలతోనే ఉండే విలన్ అజీజ్ మధ్య జరిగే హోరాహోరీ పోరాటం ప్రధాన ఆకర్షణ కానుందని చెప్పారు. అంతేకాదు విలన్ అజీజ్ పాత్ర చాలా క్రూరంగా ఉండబోతోందని, మొదటి భాగం కంటే యాక్షన్, ఎమోషన్స్ రెట్టింపు స్థాయిలో ఉంటాయని టాక్. ఒకరిపై ఒకరు టిట్ ఫర్ ట్యాట్ తరహాలో ఎత్తు పైఎత్తులతో సాగే ఈ సినిమా ఆద్యంతం ఎమోషన్స్ రక్తి కట్టిస్తాయని కూడా చెబుతున్నారు.
ప్రభాస్ తో స్పిరిట్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో `యానిమల్ పార్క్` స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులపై సందీప్ వంగా దృష్టి సారించగలరు. రణబీర్ కపూర్ కూడా ఈలోపు తన ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి అందుబాటులోకి రావాల్సి ఉంటుంది.
సందీప్ వంగా ఒక బ్రాండ్:
భారతదేశంలో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఒక బ్రాండ్. అతడి సినిమాల్లోని రక్తపాతం, క్రూరత్వం, స్త్రీ విద్వేషం గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నా కానీ, నేటి అధునాతన సమాజానికి ప్రతిబింబంగా కనిపించే కథలు, కంటెంట్, రగ్డ్ ఎమోషన్స్ ని అందించగల సత్తా ఉందని ప్రాక్టికల్ గా బాక్సాఫీస్ విజయం రూపంలో నిరూపించాడు. ఓవైపు విమర్శిస్తూనే అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకులు వంగా సక్సెస్ విషయంలో అసూయకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో పాటు, ఖాన్ ల త్రయం కూడా సందీప్ వంగాతో సినిమా కోసం ఎదురు చూస్తున్నారంటే, దానిని అర్థం చేసుకోవాలి. సందీప్ దృష్టి ప్రస్తుతం తెలుగులో ఉన్న అరడజను అగ్ర హీరోలపై ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్లతో వరుస చిత్రాల్ని పాన్ ఇండియాలో తెరకెక్కించాలని అతడు ప్రయత్నిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరోలంతా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంగా తో సినిమా కోసం అంతే ఆసక్తిగా వేచి చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
