నో రిలీజ్..కానీ మూడు స్టేట్ అవార్డులు..అదెలా?
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల స్టేట్ ఫిల్మ్ అవార్డుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Entertainment Desk | 3 Feb 2026 1:00 AM ISTతమిళనాడు ప్రభుత్వం ఇటీవల స్టేట్ ఫిల్మ్ అవార్డుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..జనవరి 29న తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి 2022 వరకు రాష్ట్ర చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రముఖ నటీనటులు, చిత్రాలు, టాప్ టెక్నీషియన్స్‌ని గుర్తించి వారికి అవార్డుల్ని ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా `సండక్కారి` అనే చిత్రానికి 2022 సంవత్సరానికి గానూ ఏకంగా మూడు అవార్డుల్ని ప్రకటించడం అందరిని షాక్‌కు గురి చేస్తోంది.
దీనిపై తమిళనాట, నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీ ఇంత వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అలాంటప్పుడు దీన్ని అవార్డులకు ఎలా పరిగణిస్తారని, మూడు అవార్డుల్ని ఏ ప్రతిపాదికన ప్రకటించారని నెటిజన్‌లు, కోలీవుడ్ ప్రేక్షకులు, విమర్శకులు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. విచిత్రం ఏంటంటే ఇదొక రీమేక్ సినిమా. రీమేక్‌లకు అవార్డులు ఏ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వదు, అసలు లెక్కలోకే తీసుకోదు. కానీ విచిత్రంగా ఈ రీమేక్ మూవీకి ఏకంగా జ్యూరీ మెంబర్ మూడు అవార్డులు ప్రకటించడం తీవ్ర చర్చకు తెరలేపింది.
ఈ సినిమాకు మూడు ప్రధాన విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. ఒకటి ఉత్తమ చిత్రం, రెండు..ఉత్తమ నేపథ్య గాయకుడు, మూడు.. ఉత్తమ కళా దర్శకుడు..దీంతో కోలీవుడ్ మీడియా, విమర్శకులు అవార్డు కమిటీ జ్యూరీపై సెటైర్లు వేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర అవార్డులకు అర్హత సాధించాలంటే అది రీమేక్ అయి ఉండకూడదు. అంతే కాకుండా ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి ఉండాలి. ఇవేవీ పట్టించుకోకుండా ఒక మలయాళ రీమేక్ `మై బాస్` ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఏ ప్రాతిపాదికన మూడు అవార్డులు ఇచ్చారని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.
సినిమా గురించి తెలియకుండా, దాన్ని చూడకుండానే జ్యూరీ కమిటీ ఎలా అవార్డులు ప్రకటించిందని, అంతా అవార్డులు ఇవ్వడానికి ఈ సినిమాలో ఏముందని ఇచ్చారని ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. 2012లో `దృశ్యం` డైరెక్టర్ జీతూ జోసెఫ్ రూపొందించిన `మై బాస్` ఆధారంగా దీన్ని రూపొందించారు. దిలీప్, మమతా మోహన్‌దాస్ జంటగా నటించారు. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. దీని ఆధారంగా రూపొందిన `సండక్కారి`లో విమల్, శ్రియా శరన్ జంటగా నటించారు.
2022లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇంత వరకు థియేటర్లకు రాలేదు. సినిమాని కూడా హీరో విమల్, శ్రియా కూడా మర్చిపోయారు. దర్శకుడు ఆర్. మాధేశ్ కూడా మర్చిపోయిన ఈ రీమేక్ మూవీకి మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు దక్కడంతో ఈ సినిమా ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే తమిళ నాడు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులపై దర్శకుడు పా.రంజిత్ ఇటీవల విమర్శలు చేశారు. తాజా వివాదం నేపథ్యంలో ఆయనకు మద్దతు పెరిగే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
