పవన్ తో సినిమా.. అసలేం జరిగిందంటే!
రచ్చ సినిమా హిట్ అవడంతో సంపత్ నందికి ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
By: Tupaki Desk | 17 April 2025 5:33 PM ISTఅన్నీ మనం ఊహించినట్టే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? అందులోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలే జరగవు. మనం ఒకటి ప్లాన్ చేస్తే సిట్యుయేషన్స్ మరోలా మారతాయి. ఒకరితో సినిమా చేద్దామనుకుంటే అది మరొకరి దగ్గరకు వెళ్తుంది. లేదంటే అంతా ఓకే అయ్యాక సినిమా ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. డైరెక్టర్ సంపత్ నంది లైఫ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.
ఏమైంది ఈవేళ సినిమాతో పరిచయమైన సంపత్ నంది రెండో సినిమానే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సంపత్ నంది- రామ్ చరణ్ కలయికలో వచ్చిన రచ్చ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రచ్చ సినిమా హిట్ అవడంతో సంపత్ నందికి ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
ఓ రెండేళ్లు ఆ ప్రాజెక్ట్ పై వర్క్ కూడా చేశాడు సంపత్. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో పవన్, సంపత్ ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది స్క్రిప్ట్ అందించిన ఓదెల2 ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన మూవీ గురించి మాట్లాడి అసలు విషయాలను బయటపెట్టాడు.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామనుకుని ముందుగా ఆయనకు బెంగాల్ టైగర్ కథ చెప్పానని, కానీ రవితేజతో చేసిన కథ, పవన్ కు చెప్పిన కథ వేరని, తాను చెప్పిన కథ పవన్ కు కూడా నచ్చిందని, కానీ ఎందుకో ఆయన వేరే కథ చేద్దామన్నారని, ఆ కథ చెప్పి తనను దానిపై వర్క్ చేయమని పవన్ చెప్పారని, అలా సంవత్సరంన్నర పాటూ తాను దానిపై వర్క్ చేశానని, కానీ ఆఖరికి ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉండటంతో తాను ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్టు సంపత్ నంది తెలిపాడు.
జరిగిన విషయంలో ఎవరి తప్పూ లేదని, తాను వర్క్ చేసిన ఏడాదిన్నర కోసం తనకు పవన్ డబ్బులు కూడా ఇప్పించారని, ఇప్పటికీ ఆయనతో తనకు మంచి బాండింగే ఉందని వెల్లడించాడు సంపత్ నంది. అంతేకాదు, తర్వాత కూడా వేరే నిర్మాత ద్వారా తనకు పవన్ కబురు పంపారని, సినిమా చేద్దామన్నారని, కానీ ఇప్పుడు పవన్ కు టైమ్ లేదని, అన్నీ కుదిరి వీలైతే ఆయనతో కచ్ఛితంగా సినిమా చేస్తానని చెప్పిన సంపత్, పవన్ ఎంత మంచివారో అందరికంటే తనకు కొంచెం ఎక్కువ తెలుసని అన్నాడు.
