Begin typing your search above and press return to search.

సమోసా కోసం ఇంత దారుణమా?

ఒకప్పుడు దంపతుల మధ్య గొడవ జరిగితే నాలుగు గోడల మధ్యే ఉండపోయేది. ఎవరో ఒకరూ వెనక్కి తగ్గి తమ సమస్యను పరిష్కరించుకునే వారు.

By:  Tupaki Desk   |   7 Sept 2025 4:11 PM IST
సమోసా కోసం  ఇంత దారుణమా?
X

ఒకప్పుడు దంపతుల మధ్య గొడవ జరిగితే నాలుగు గోడల మధ్యే ఉండపోయేది. ఎవరో ఒకరూ వెనక్కి తగ్గి తమ సమస్యను పరిష్కరించుకునే వారు. కానీ రాను రాను వైవాహిక బంధాలు నీటి బుడగలుగా మారిపోతున్నాయి. చిన్న విషయాలను కూడా తమ కోణంలో వాటిని పెద్దగా భావిస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు భార్య భర్తల మధ్య గొడవల్లో అటు, ఇటు తల్లిదండ్రులు కూడా కలుగజేసుకొని చిన్నపాటి మనస్పర్థలను వివాదాలుగా మార్చుతున్నారు. ముఖ్యంగా, చిన్న చిన్న విషయాల కోసం పెద్ద ఘర్షణలు చోటుచేసుకోవడం కుటుంబ వ్యవస్థను అగాథంలోకి నెట్టేస్తున్నాయి.

సమోసా తేలేదని.. పంచాయితీ..

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో చోటుచేసుకున్న సంఘటన ఒక తీవ్రమైన ఉదాహరణగా నిలిచింది. సంగీత అనే యువతికి శివం అనే వ్యక్తితో పెళ్లయింది. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో సమోసా చిచ్చు పెట్టింది. ఒకరోజు సంగీత తనకు సమోసా తీసుకు రమ్మని భర్తకు చెప్పింది. ఇంటికి వచ్చే తొందరలో శివం సమోసా తీసుకురావడంతో భార్య భర్తతో గొడవకు దిగింది. ఈ విషయం సంగీత పుట్టింటి వారికి తెలియడంతో వారు అత్తింటి వారిపై పంచాయితీ పెట్టించారు.

మాటామాటా పెరిగి..

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడులు చేసుకున్నారు. సంగీత బంధువులు శివంతో పాటు అతని తండ్రిని కూడా విపరీతంగా కొట్టారు. స్థానికులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు.

ఈ ఘటనపై శివం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా సంగీత బంధువులపై కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేశారు.

వీడియో వైరల్..

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. భార్య చిన్న కోరికను తీర్చలేకపోయాడంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

కుప్పకూలుతున్న కుటుంబ వ్యవస్థ

దంపతుల మధ్య వచ్చే మనస్పర్థలను సద్దుమణిగించాల్సిన పెద్దలు మరింత వివాదానికి కారణమవుతున్నారనేది ఈ ఘటనతో స్పష్టమవుతున్నది. తమ అనుభవంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ముందుకు సాగుతున్న పెద్దలు చిన్న సమోసా విషయంలో గొడవలు పడి దాడులు చేసుకోవడం, అవి పోలీస్ స్టేషన్ల దాకా చేరి అరెస్టు కావడం కుప్పకూలుతున్న కుటుంబ వ్యస్థకు నిదర్శనంగా నిలుస్తున్నది.