Begin typing your search above and press return to search.

సామ్ పేరుతో ఇడ్లి కొట్టు: దేవరకొండ

హీరోయిన్ సమంత రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా ఖుషీ

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:08 AM GMT
సామ్ పేరుతో ఇడ్లి కొట్టు: దేవరకొండ
X

హీరోయిన్ సమంత- రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా 'ఖుషీ'. సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్‌ పర్వాలేదనిపించింది. సామ్-విజయ్ జోడీ క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ సినిమా షూట్ మధ్యలో నుంచి ఒకవేళ సమంత వెళ్లిపోయి ఉంటే తాము ఏం చేసేవారో తెలిపారు.

వాస్తవానికి ఖుషి మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సమంత ఈ చిత్రాన్ని పూర్తి చేస్తుందా లేదా అనే అనుమానం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఎందుకంటే ఈ మూవీ షూట్ సమయంలోనే సామ్‌కు మాయోసైటీస్ అనే వ్యాధి ఉందని తెలిసింది. ఇది తగ్గాలంటే సుదీర్ఘ చికిత్స అవసరమని కూడా ఆమెనె తెలిపింది. దీంతో సామ్.. ఇక ఖుషిలో భాగం కాకపోవచ్చని అంతా అనుకున్నారు.

అప్పుడప్పుడు ఖుషి షూటింగ్ నిలిచిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ సమయంలో చిత్రబృందం.. ఎప్పటికప్పుడు స్పందిస్తూ రూమర్స్ కు చెక్ పెడుతూనే వచ్చింది. కానీ అప్పటికీ నిజంగానే సమంత మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల షూటింగ్ అప్పుడప్పుడూ ఆగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ విషయమై విజయ్ కు రిపోర్టర్లు పలు ప్రశ్నలు సంధించారు.

చిత్రీకరణ సమయంలో సమంత గురించి తెలుసుకున్న విషయాలు ఏంటి? ఈ మూవీ షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా సమంత చిత్రీకరణకు రాలేదు. షూటింగ్ నిలిచిపోయింది. అప్పుడు మీ ఆలోచన ఏమిటి? అని అడిగారు. దీనికి విజయ్ మాట్లాడుతూ.. "ఏమాయ చేసావే నుంచే సమంతను అభిమానిస్తున్నాను.

తను అద్భుతమైన వ్యక్తి. హార్డ్‌ వర్క్‌ను ప్రశంసించాలి. తను లేకుండా ఈ లవ్ స్టోరీ మూవీని ప్రమోట్ చేయడం బాధగా ఉంది. ఆమెను మిస్‌ అవుతున్నాను" అని విజయ్ అన్నారు.

"అయితే షూటింగ్ అప్పుడు మొదట్లో మేము ఫస్టాఫ్‌ చిత్రీకరించేశాం. ఆమె వచ్చే వరకూ మేము వెయిట్‌ చేయాలనుకున్నాం. మాకేం కంగారులేదు. తను సినిమాకు ఎంత ప్రాణం పోస్తుందో తెలుసు. అందుకే ఆరు నెలలు కాదు. సంవత్సరం కాదు. అవసరమైతే పదేళ్లైనా వెయిట్ చేద్దామని నేను దర్శకుడు అనుకున్నాం. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఇంకా చెప్పాలంటే ఆమె వచ్చే వరకూ విజయవాడ హైవేపై సమంత పేరుతో ఇడ్లీ బండి పెట్టుకుందామంటూ సరదాగా జోక్స్‌ వేసుకునేవాళ్లం. ఆమెకు తప్పకుండా థ్యాంక్యూ చెప్పాలి" అని విజయ్ సరదాగా కామెంట్స్ చేశారు.