సమంత గొప్ప యోధురాలు..!
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. సౌత్ నుంచి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది.
By: Tupaki Desk | 26 April 2025 12:22 PM ISTస్టార్ హీరోయిన్ సమంత ఇటీవల బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. సౌత్ నుంచి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఈమె నుంచి ఎక్కువ సినిమాలు, సిరీస్‌లు కూడా రావడం లేదు. ఆ మధ్య తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సమంత ఈ మధ్య పూర్తిగా కోలుకుంది. గత కొన్ని నెలలుగా బిజీ బిజీ గా షూటింగ్‌లో పాల్గొంటుంది. వచ్చే ఏడాది నుంచి సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమంత ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. ఒక దర్శకుడితో ఈమె ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాజాగా చెన్నైలో ఒక అవార్డ్ వేడుకలో సమంత పాల్గొంది. అదే అవార్డ్ వేడుకకి ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర పాల్గొన్నారు. ఆకాశమే నీ హద్దురా సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈమె ప్రస్తుతం కోలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. అవార్డ్ వేడుకలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సమంత గురించి ఆమె మాట్లాడుతూ ప్రశంసలు కురిపించింది. సమంత గొప్పతనం గురించి చెప్పడం మాత్రమే కాకుండా.. తనకు చాలా విషయాల్లో సమంత ఆదర్శం అంటూ ఆకాశానికి ఎత్తే విధంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుధ కొంగర మాట్లాడుతూ... సమంత నాకు ఆప్తురాలు. ఆమె కష్ట సమయంలో ఉన్నప్పుడు పడ్డ మనోవేదన గురించి నాకు తెలుసు. ఆ సమయంలో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమంతతో నాకు లోతైన సంబంధాలు ఉన్నాయి. ఆమె గొప్ప పోరాట యోధురాలు. ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో తీసుకుంటుంది. సమంత ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తుంది. ఆమె పోరాట పటిమ నాకు ప్రేరణను ఇస్తుంది. ఆమెతో ఒక్క సినిమా అయినా చేయాలి అనేది నా కోరిక. త్వరలో ఆ కోరిక తీరుతుందనే నమ్మకంతో ఉన్నాను. సమంతతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ సుధ కొంగర చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
సమంత ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌తో పాటు ఒక హిందీ సినిమాలో నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన షూటింగ్ చకచక జరుగుతోంది. ఈ ఏడాది చివరి వరకు వెబ్ సిరీస్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఈ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు గాను భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేసింది. మరికొన్ని సినిమాలను సైతం ఈమె కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమంత వ్యక్తిగత విషయాలకు వస్తే నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాలంగా సింగిల్‌గానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
