సామ్ ఈజ్‌బ్యాక్...మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసినట్టేనా?
టాలీవుడ్ స్టార్ హీరోలలో క్రేజీ ఫాన్ పాలోయింగ్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత.
By: Tupaki Desk | 7 Jan 2026 5:33 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోలలో క్రేజీ ఫాన్ పాలోయింగ్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత. తొలి సినిమాతో ప్రేక్షకుల్ని తన మాయలో పడేసి స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన సామ్ టాలీవుడ్ టాప్ స్టార్స్‌కు ఏకైక ఆప్ఫన్‌గా నిలిచి స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టు నేచురల్ స్టార్ నాని వరకు క్రేజీ స్టార్లతో నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో సవాళ్లు, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి కారణాలు, వరుస సినిమాల వైఫల్యం కారణంగా రేసులో వెనకబడింది.
ఆరోగ్య కారణాల దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సామ్ సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన `శుభం` మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని సమయంలోనే సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ `మా ఇంటి బంగారం`కు సంబంధించిన అప్ డేట్‌ని కూడా ఇచ్చింది. ఆ తరువాత నుంచి దీనిపై ఎలాంటి వార్త బయటికి రాలేదు. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్‌గా సామ్ భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు వ్యవహరిస్తున్నాడు. చాలా రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా సామ్ తన అభిమానులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఓ కొత్త పోస్టర్‌ని అభిమానులతో పంచుకున్న సమంత దీనికి ఆసక్తికరమైన క్యాప్షన్‌ని జోడించింది. `మీరు చూస్తా ఉండండి... మా ఇంటి బంగారం మీతో కలిసిపోతుంది` అని క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాకుండా ఈ మూవీ టీజర్‌ని జనవరి 9న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నెట్టింట `క్వీన్ ఈజ్ బ్యాక్` అని కామెంట్లు చేస్తున్నారు. `ఓ బేబీ` తరువాత సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
గతేడాది అక్టోబర్‌లోనే ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించారు. సామ్ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్‌పై నిర్మిస్తోంది. దర్శకుడు, సామ్ భర్త రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై సామ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని పక్కాగా ప్లాన్ ప్లాన్ చేసుకున్నట్టు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు సమంత బాలీవుడ్ యాక్షన్ డ్రామా `రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్`లోనూ నటిస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ మూవీకి దర్శకద్వయం రాజ్ నిడిమోరు, డీకె దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఇది రూపొందుతోంది. దీనిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరువాత రాజ్ అండ్ డీకే చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఈ రెండు సినిమాలతో సామ్ ట్రాక్‌లోకి వచ్చేనా అన్నది వేచి చూడాల్సిందే.
