మీకు థ్యాంక్స్ చెప్పడానికి 15 ఏళ్లు పట్టింది
ఈ స్టేజ్ పై నిలబడి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి తనకు 15 ఏళ్లు పట్టిందని, ఏ మాయ చేసావే నుంచి మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదని
By: Tupaki Desk | 6 July 2025 1:15 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ కారణంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని, మెల్లిగా కోలుకున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత సమంత మళ్లీ ఇప్పుడే యాక్టివ్ అవుతున్నారు. రీసెంట్ గా నిర్మాతగా మారి శుభం సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సమంత తాజాగా జరిగిన 24వ తానా మహాసభలకు హాజరై తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
తాను ఏ పని చేసినా ముందుగా ఆలోచించేది తెలుగు ప్రేక్షకుల గురించేనని, ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు సమంత. తాను ప్రతీ ఏడాదీ తానా గురించి వింటూనే ఉన్నానని, ఏ మాయ చేశావే సినిమా నుంచే తమలో ఒకరిగా చూసిన తెలుగు వారికి సమంత ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ తెలుగు వారు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వారని తెలిపారు సమంత.
అందులో భాగంగా తానా వేదికపై మాట్లాడుతూ సమంత ఎమోషనల్ అవగా, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ స్టేజ్ పై నిలబడి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి తనకు 15 ఏళ్లు పట్టిందని, ఏ మాయ చేసావే నుంచి మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదని, మొదటి సినిమా నుంచే మీరంతా నన్ను సొంతమనుకున్నారని, ఇది తన కెరీర్లో ఓ ముఖ్యమైన దశ అని, తన మొదటి ప్రొడక్షన్ శుభమ్ సినిమాను ఎక్కువగా మెచ్చుకున్న వ్యక్తులు నార్త్ అమెరికాకు చెందిన వాళ్లేనని సమంత అన్నారు.
తాను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా తెలుగు ప్రేక్షకుల గురించే ఆలోచిస్తానని, తెలుగు వారంతా తనకు ఓ స్పెషల్ ఐడెంటిటీని ఇచ్చారని, తెలుగు తనకు సొంతిల్లు లాంటిదని, ఓ బేబీ మిలియన్ డాలర్లు సంపాదించిన విషయం కూడా తనకు గుర్తుందని చెప్పారు సమంత. మీరెంత దూరంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ నా మనసులోనే ఉంటారని సమంత ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా సమంత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ తో పాటూ మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.