Begin typing your search above and press return to search.

ఫామ్‌హౌస్‌కి శాశ్వ‌తంగా షిఫ్ట‌వుతున్న స్టార్ హీరో

దుండ‌గుల తుపాకీ కాల్పుల ఘ‌ట‌న స‌ల్మాన్ కుటుంబాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌న‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ

By:  Tupaki Desk   |   24 April 2024 2:30 AM GMT
ఫామ్‌హౌస్‌కి శాశ్వ‌తంగా షిఫ్ట‌వుతున్న స్టార్ హీరో
X

దుండ‌గుల తుపాకీ కాల్పుల ఘ‌ట‌న స‌ల్మాన్ కుటుంబాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌న‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ. కొద్దిరోజుల క్రితం బాంద్రాలోని త‌న ఇంటి ప‌రిస‌రాల్లో రెక్కీ నిర్వ‌హించి మ‌రీ కాల్పులు జ‌రిపిన నిందితులు అందించిన వివ‌రాల ప్ర‌కారం.. వారంతా స‌ల్మాన్ భాయ్ ఫామ్ హౌస్ లోను రెక్కీ నిర్వ‌హించారు. ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి నాలుగు రోజుల ముందు వారు ఫామ్ హౌస్ లో రెక్కీ నిర్వ‌హించారు. అంతేకాదు.. స‌ల్మాన్ ఫామ్ హౌస్ కి స‌మీపంలోని ఒక ఇంటిలో అద్దెకు కూడా దిగారు.

కాల్పుల ఘ‌ట‌న‌తో భాయ్ కుటుంబం తీవ్ర క‌ల‌త‌కు గురైంది. ఇది బెదిరించేందుకు మాత్ర‌మేన‌ని ఆ కుటుంబం భావించ‌డం లేదు. గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ స‌ల్మాన్ కుటుంబాన్ని నిజంగానే భ‌య‌పెట్టారు. క‌ల‌త‌కు గురి చేసారు. వారంతా ఇప్పుడు కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు కూడా ఇది కార‌ణం కానుంది. నిజానికి స‌ల్మాన్ ఖాన్ బాంద్రాలో త‌న అమ్మా నాన్న‌లతో క‌లిసి గేలాక్సీ అపార్ట్ మెంట్ లో నివ‌శించ‌డానికి అల‌వాటు ప‌డ్డారు. ఇందులో ఆయ‌న సింగిల్ బెడ్ రూమ్ లో ఉంటారు. త‌న త‌ల్లిదండ్రులు అదే భ‌వంతిలో ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న‌ అపార్ట్ మెంట్ లో నివ‌శిస్తున్నారు. దుండ‌గులు ఈ ఇంటిపైనే తుపాకీల‌తో ఫైరింగ్ చేసి పారిపోయారు. అప్ప‌టి నుంచి గేలాక్సీ అపార్ట్ మెంట్ల‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది.

సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఎపిసోడ్ తో అత‌డి చుట్టూ భద్రత పెంపున‌కు కార‌ణ‌మైంది. ఇది ఇండ‌స్ట్రీలో తీవ్ర‌ చర్చకు దారితీసింది. స‌ల్మాన్ పై ఎటాక్ అనంత‌రం సీనియర్, అత్యంత గౌరవనీయమైన నటి ఆశా పరేఖ్ మాట్లాడుతూ, ''సల్మాన్ జాతీయ ఆస్తి.. అతని భద్రత ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది'' అని వ్యాఖ్యానించారు. అనంత‌రం తుపాకీ కాల్పుల ఎపిసోడ్‌కు బాధ్యులెవరో వారిని తొలగిస్తామ‌ని మహారాష్ట్ర సిఎం, ఏక్‌నాథ్ షిండే హామీ ఇవ్వడం ఒక రాష్ట్ర అత్యున్నత రాజకీయ వర్గాల నుండి రావాల్సిన వర్గీకరణ ప్రకటనలా కనిపించడం లేదు. సల్మాన్ భద్రతకు ఇది ఎలాంటి సహాయం చేయదని కుటుంబీకులు భావిస్తున్నారు.

అక్క‌డి పరిస్థితిపై తాజా సమాచారం ఏమిటంటే.. సల్మాన్ పన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌కు శాశ్వ‌తంగా మారే విష‌యాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాడు. స‌ల్మాన్ సన్నిహిత మిత్రుడు ఒక‌రు ఇలా వెల్లడించాడు, ''భాయ్ తన పొలంలో ఎక్కువ సమయం గడుపుతాడు. అతడు అక్కడ ఉండటాన్ని ఇష్టపడతాడు. ఇది అతని బిగ్ బాస్ షూటింగ్ లొకేషన్‌కు కూడా దగ్గరగా ఉంటుంది. నగరంలో అతని భద్రత తీవ్రంగా ప్రమాదంలో పడటంతో భాయ్ పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌కి శాశ్వతంగా మారాలని చూస్తున్నారు'' అని తెలిపారు.

సల్మాన్ తల్లిదండ్రులు కూడా ఫామ్ హౌస్ కే వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత‌ లేదు. అయితే తల్లిదండ్రులకు దూరంగా ఉండలేనని సల్మాన్ పదే పదే చెప్పడం గమనార్హం. పోలీసు నివేదికల ప్రకారం.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు సంఘటనకు నాలుగు రోజుల ముందు పన్వెల్‌లోని అతని ఫామ్‌హౌస్‌లో రెక్కీ నిర్వహించారు. కానీ ఇప్పుడు స‌ల్మాన్ అదే ఫామ్ హౌస్ కి వెళ్లాల‌ని చూస్తున్నారు.