సల్మాన్ - పైడిపల్లి-దిల్‌రాజు కాంబో: మాస్ హీరోకు ఫ్యామిలీ ఎమోషన్స్ తోడైతే బాక్సాఫీస్ హిట్టే
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ట్రెండ్ మారింది. కేవలం యాక్షన్ సన్నివేశాలు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడటం లేదు.
By: Sivaji Kontham | 21 April 2026 9:42 AM ISTబాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ - టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలయికలో సినిమా ప్రకటించినప్పటినుండి ఒకటే ప్రశ్న అందరినీ వేధిస్తోంది.. సల్మాన్‌ను వంశీ తెరపై ఎలా చూపిస్తారు? సల్మాన్ ఖాన్ అంటేనే ఒక మాస్ యాక్షన్ హీరో. అయితే ఆయన కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా `బజరంగీ భాయ్‌జాన్`, `సుల్తాన్` వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించగలరని నిరూపించారు. అందుకే సల్మాన్ ఇమేజ్‌కు వంశీ పైడిపల్లి తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను అద్దితే ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
వంశీ పైడిపల్లి తన గత చిత్రాలైన బృందావనం, మహర్షి, వారసుడు చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్ ని థియేటర్లకు రప్పించగలరనే విషయం నిరూపణ అయింది. ఆయన కథల్లో యాక్షన్ కంటే కుటుంబ విలువలు, స్నేహం, సామాజిక బాధ్యత వంటి భావోద్వేగాలకే పెద్దపీట వేస్తారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంటి ఒక భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరోకు ఇలాంటి `ఎమోషనల్ టచ్` తోడైతే అది కేవలం యాక్షన్ ప్రియులనే కాకుండా గృహిణులను, ఏజ్డ్ వ్యక్తులను కూడా థియేటర్లకు రప్పిస్తుంది. సల్మాన్‌లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించడం ద్వారా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సల్మాన్ ఇటీవలి కాలంలో టైగర్ ఫ్రాంఛైజీతో కేవలం యాక్షన్ ని మాత్రమే అందించాడు. అందుకు భిన్నంగా పైడిపల్లి సినిమా ఉంటుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ట్రెండ్ మారింది. కేవలం యాక్షన్ సన్నివేశాలు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడటం లేదు. కంటెంట్ లో ప్రేక్షకుడికి కనెక్టివిటీ ముఖ్యం. దక్షిణాది సినిమాల్లో ఉండే ఆత్మీయమైన బంధాలు, నేటివిటీ ఎమోషన్స్ ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టమైన అంశంగా మారాయి. కాబట్టి తెలుగు చిత్రాల్లోని బలమైన కుటుంబ నేపథ్యాన్ని వంశీ గనుక సల్మాన్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మలచగలిగితే ఈ సినిమా జాతీయ స్థాయిలో ఒక `యూనివర్సల్ అప్పీల్` ఉన్న చిత్రంగా నిలవడం ఖాయం.
ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంచుకోవడం కూడా వంశీ ఎత్తుగడలో ఒక భాగమని తెలుస్తోంది. నయనతార కేవలం గ్లామర్ కోసమే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటారు. వీరిద్దరి మధ్య సాగే ఎమోషనల్ డ్రామా సినిమాకు అస్సెట్ గా నిలిచే అవకాశం ఉంది. అట్లీ, సందీప్ రెడ్డి వంగా వంటి దక్షిణాది దర్శకులు బాలీవుడ్ స్టార్లతో భారీ విజయాలు అందుకున్న నేపథ్యంలో వంశీ పైడిపల్లి కూడా అదే బాటలో పయనిస్తూ.. దక్షిణాది - ఉత్తరాది ప్రేక్షకులను ఏకకాలంలో మెప్పించేలా ఈ పాన్ ఇండియా స్క్రిప్ట్‌ను తెరకెక్కించాల్సి ఉంటుంది.
సల్మాన్ - వంశీ కాంబినేషన్ కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా.. తెలుగు సినిమాల స్పెషాలిటీ అయిన `ఎమోషనల్ కంటెంట్`ను అందిస్తే అది జాతీయ స్థాయిలో అన్ని వర్గాలను మెప్పించగలదని ఆశించవచ్చు. వంశీ తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సల్మాన్ మాస్ ఇమేజ్‌తో పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలిగితే.. 2027లో బాక్సాఫీస్ వద్ద మరో మ్యాసివ్ హిట్ నమోదు కావడం ఖాయం. పాన్ ఇండియా సినిమాల వెల్లువలో ఈ కొత్త కాంబినేషన్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో వేచి చూడాలి.
