ఈ హీరో మార్కెట్ గల్లంతయినట్లేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన 'సికిందర్' సినిమా సైతం నిరాశ పరచింది.
By: Tupaki Desk | 31 March 2025 7:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన 'సికిందర్' సినిమా సైతం నిరాశ పరచింది. సౌత్ సినిమాలు వందల కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సమయంలో సికిందర్ సినిమా మొదటి రోజు కేవలం రూ.26 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో, అది కాకుండా భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ ఓపెనింగ్స్ అనేవి చాలా చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమాలు గత కొన్నాళ్లుగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న నటించడంతో అంచనాలు కాస్త పెరిగాయి. కానీ సల్మాన్ ఖాన్ ఫేట్‌ను రష్మిక మందన్న మార్చలేక పోయింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకు పోతున్న రష్మికకు 'సికిందర్' పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా నిలిచింది.
'సికిందర్' సినిమా లాంగ్ రన్‌లో రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేస్తే గొప్ప విషయం అన్నట్లు పరిస్థితి ఉంది. బాలీవుడ్‌లో ఇతర హీరోల సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయితే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాలు మినిమం వసూళ్లు చేయక పోతే ఎలా అంటూ కొందరు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ వయసు గురించి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేసుకోవాలి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ వసూళ్లు నమోదు చేయడంతో పాటు, కొన్ని డిజాస్టర్‌గానూ నిలిచాయి.
సల్మాన్ ఖాన్ సినిమాలు ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలతో పోటీ పడేవి. ఇటీవల షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ మూడు విజయాలను సొంతం చేసుకున్నాడు. త్వరలో రాబోతున్న సినిమాతోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాతో మరోసారి అభిమానులను నిరాశ పరచడంతో తర్వాత సినిమాలపై పెద్దగా అంచనాలు ఆసక్తి లేవు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో సినిమాలు అంటే మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్‌తో భారీ బడ్జెట్ సినిమాలు అంటే రిస్క్ అనే ఆలోచనతో నిర్మాతలు ఉన్నారు.
ప్రస్తుత పరిస్థితులు అన్ని చూస్తూ ఉంటే సల్మాన్ ఖాన్ మార్కెట్ ఇప్పటికే చాలా తగ్గింది. ముందు ముందు సైతం సల్మాన్ ఖాన్ సినిమాలంటే ప్రేక్షకులు సైతం లైట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక సల్మాన్ ఖాన్ సినిమాలు రాబోయే రోజుల్లో మరింతగా తక్కువ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, పాన్ ఇండియా మార్కెట్ పక్కన పెడితే కనీసం హిందీ మార్కెట్‌లోనూ ఈయన సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడటం లేదని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
