పైరసీ నష్టం 91 కోట్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్!
వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు తీయడం ఈరోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. అయితే పెట్టుబడిని కలెక్షన్ల రూపంలో తిరిగి రాబట్టడమే సవాల్ గా మారుతోంది.
By: Tupaki Desk | 17 Jun 2025 11:08 PM ISTవందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు తీయడం ఈరోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. అయితే పెట్టుబడిని కలెక్షన్ల రూపంలో తిరిగి రాబట్టడమే సవాల్ గా మారుతోంది. దీనికి కారణం జనాలు ఓటీటీలకు అలవాటు పడటం, థియేటర్లలో పెరిగిన టికెట్ రేట్లు. దీనికి తోడు కంటెంట్ బాలేదని మొదటిరోజే సమీక్షలు వచ్చేస్తే, ఆ సినిమా చూసేందుకు జనం కదిలి రారు. ఇటీవలి కాలంలో అలాంటి క్రిటికల్ సన్నివేశాన్ని ఎదుర్కొంది సల్మాన్ నటించిన సికందర్ మూవీ. ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా ఔట్ డేటెడ్ కంటెంట్ తో తెరకెక్కిందని విమర్శలొచ్చాయి.
అయితే సినిమా రిలీజైన గంటలోనే హెచ్.డి. క్వాలిటీ ప్రింట్ ఆన్ లైన్ లో లీకైపోయింది. ఇది నిజంగా సల్మాన్ సినిమాకి పెద్ద దెబ్బ కొట్టిందని నదియాద్ వాలా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ తాజాగా ప్రకటించింది. జనం డౌన్ లోడ్ చేసుకుని చూసేందుకే ఇటీవల ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ అలవాటును మాన్పించే పరిస్థితి లేదు. పైరసీని పూర్తిగా నిర్మూలించే తెగువ పరిశ్రమలో కనిపించడం లేదు. అయితే పెద్ద సినిమాలు పైరసీ కారణంగా నష్టపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదుకుంటాయా? అన్నది ఇప్పుడు చర్చ. సల్మాన్ సికందర్ మూవీ పైరసీ లీక్ కారణంగా నష్టపోయింది అంటూ నిర్మాతలు ఇన్సూరెన్స్ కి అప్లయ్ చేస్తున్నారట.
అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి వాటిని నమ్మి క్లెయిమ్ లు చెల్లిస్తాయా? అన్నది చెప్పలేం. ప్రతిదానికి లెక్కలు చెప్పాలి. డాక్యుమెంటేషన్ భారీగా ఉంటుంది. పరిశోధనలు ఉంటాయి. పోలీసుల విచారణ తర్వాత నిజంగానే దానికి డ్యామేజ్ జరిగిందని ప్రూవ్ అయితే అప్పుడు స్పందిస్తాయి. దీనికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సికందర్ సినిమా కోసం 91 కోట్ల నష్టాన్ని క్లెయిమ్ చేయాలని నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోందట. అయితే ఇంత పెద్ద మొత్తం చెల్లించాలంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా పరిశోధనలకు దిగుతాయనడంలో సందేహం లేదు. సెట్లు తగలబడితే క్లెయిమ్ చేసుకునేలా అవకాశం ఉంటుంది. కానీ పైరసీతో నష్టపోతే దానికి క్లెయిమ్ వస్తుందా? అన్నది వేచి చూడాలి. అయినా సామాన్యుడు వేలు, లక్ష లోపు క్లెయిమ్ చేస్తేనే వంద ఆరాలు తీసే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంత పెద్ద మొత్తాన్ని తిరిగి వెనక్కి చెల్లిస్తాయా? అన్నది వేచి చూడాలి.
