Begin typing your search above and press return to search.

పాన్ మసాలా ప్రకటన వివాదం: స‌ల్మాన్ లాయ‌ర్ చాలా గ‌ట్టోడే!

ఈ పాన్ మసాలా ప్రకటన వివాదం దేశవ్యాప్తంగా గతంలోనే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

By:  Sivaji Kontham   |   12 Jun 2026 11:29 PM IST
పాన్ మసాలా ప్రకటన వివాదం: స‌ల్మాన్ లాయ‌ర్ చాలా గ‌ట్టోడే!
X

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు చట్టపరమైన పాత వివాదం ఒకదానిలో తాత్కాలిక ఉపశమనం లభించింది. డ‌బ్బు కోసం ఒక ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్ ప్రకటనలో నటించి వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ దాఖలైన ఫిర్యాదు ఆధారంగా నడుస్తున్న జిల్లా వినియోగదారుల ఫోరమ్ విచారణా ప్రక్రియను నిలిపివేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని కోటా జిల్లా వినియోగదారుల ఫోరమ్ (డిసిడిఆర్‌సి) గతంలో సల్మాన్ ఖాన్‌ సహా పలువురి సంతకాలను ధృవీకరించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌పై జాతీయ కమిషన్ విచారించింది.

ఈ కేసును పరిశీలించిన ఎన్‌సిడిఆర్‌సి అధ్యక్షులు జస్టిస్ ఎ.పి. సాహి, ఇత‌ర‌ సభ్యులు భరత్ కుమార్ పాండ్యాలతో కూడిన ధర్మాసనం.. ఫిర్యాదుదారుడైన ఇంద్ర మోహన్ సింగ్ అలియాస్ హనీకి నోటీసులు జారీ చేసింది. జూన్ 10న ఇచ్చిన తమ ఉత్తర్వుల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కోటా జిల్లా ఫోరమ్‌లో ఈ వివాదానికి సంబంధించిన ఎలాంటి విచారణలు ముందుకు సాగడానికి వీల్లేదని, స్టే విధిస్తున్నామని కమిషన్ స్పష్టం చేసింది. ఈ వివాదంలో జిల్లా ఫోరమ్ తన పరిధిని దాటి వ్యవహరించిందనే అప్పీలుదారుల వాదనపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని జాతీయ కమిషన్ అభిప్రాయపడింది.

సల్మాన్ ఖాన్ తరపున హాజరైన న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ.. అసలు వినియోగదారుల చట్టం ప్రకారం.. ఈ ఫిర్యాదుకు విచారణార్హత ఉందా లేదా అనేది ప్రాథమికంగా తేల్చకుండానే జిల్లా ఫోరమ్ నేరుగా సంతకాల ప్రామాణికతను చెక్‌ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇదే సంతకాల ధృవీకరణ ఆదేశాలపై గతంలో మే 27న రాజస్థాన్ హైకోర్టు కూడా స్టే ఇచ్చిందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సెలబ్రిటీలను వేధించడమే లక్ష్యంగా ఇటువంటి ఫిర్యాదులను చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ వేర్వేరు ఫోరమ్‌లలో దాఖలు చేస్తున్నారని అప్పీలుదారులు ఆరోపించారు.

ఈ పాన్ మసాలా ప్రకటన వివాదం దేశవ్యాప్తంగా గతంలోనే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సల్మాన్ ఖాన్ వంటి అగ్ర శ్రేణి నటుడు ఇటువంటి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనల్లో నటించి వినియోగదారులను.. ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనేది ప్రధాన ఫిర్యాదు. ఈ తాజా స్టే ఉత్తర్వుల కాపీని జిల్లా ఫోరమ్ రికార్డులలో ఉంచాలని ఆదేశించిన ఎన్‌సిడిఆర్‌సి.. తదుపరి తుది విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది. అంతవరకు ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదురుకాకపోవడం గమనార్హం.

సెలబ్రిటీల వాణిజ్య ప్రకటనలపై వినియోగదారుల చట్టం ఇటీవల కాలంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేసేటప్పుడు సదరు స్టార్స్‌కు కూడా బాధ్యత ఉంటుందని చట్టాలు చెబుతున్నా.. ప్రొసీజర్ - పరిధిని దాటి కోర్టులు ఆదేశాలు ఇవ్వకూడదనే కోణంలో ఈ తాజా తీర్పు ఉన్న‌ట్లు కనిపిస్తోంది. జూన్ 22న తదుపరి విచారణలో జాతీయ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే అంశంపై అటు సల్మాన్ ఖాన్ అభిమానులతో పాటు లీగల్ వర్గాలలోనూ ఆసక్తి నెలకొంది.