సంపాదనలో నం.1 భారతీయ టీవీ హోస్ట్?
బిగ్ బాస్- హిందీ ఒక్కో సీజన్ కి 250 కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే అతడు ఏడాదిలో మూడొంతుల సమయం కేవలం బిగ్ బాస్ కే కేటాయించాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 31 May 2025 9:30 AM ISTభారతదేశంలో నంబర్ వన్ సంపాదనాపరుడైన టీవీ హోస్ట్ ఎవరు? కేబీసీ స్టార్ అమితాబ్ బచ్చన్? బిగ్ బాస్- తెలుగు హోస్ట్ కింగ్ నాగార్జున, బిగ్ బాస్ తమిళం హోస్ట్ కమల్ హాసన్? కపిల్ శర్మ, రూపాలి గంగూలీ? .. వీళ్లలో ఎవరై ఉంటారు? అంటే ఈ సెలబ్రిటీలు ఎవరూ కాదు. నెలకు రూ.60 కోట్లు సంపాదించే ఏకైక బుల్లితెర హోస్ట్ ది గ్రేట్ సల్మాన్ ఖాన్. బిగ్ బాస్- హిందీ ఒక్కో సీజన్ కి 250 కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే అతడు ఏడాదిలో మూడొంతుల సమయం కేవలం బిగ్ బాస్ కే కేటాయించాల్సి ఉంటుంది.
భారతదేశం సహా దేశం వెలుపల కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ ఖాన్ బిగ్ బాస్- హిందీ హోస్ట్ గా అత్యంత విజయవంతమైన హోస్ట్. అతడు అత్యంత భారీ మొత్తాన్ని పారితోషికంగా అందుకుంటున్నారు. అతడు భారతదేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ స్టార్. అతడు చేస్తున్నది ఒకే ఒక్క టీవీ షో. కానీ నెలకు రూ.60 కోట్ల భారీ జీతం తీసుకుంటాడు. 15 వారాల పాటు పనిచేసిన సల్మాన్ దాదాపు 250 కోట్లు సంపాదించాడని సమాచారం. కపిల్ శర్మ, అనుపమ ఫేమ్ రూపాలి గంగూలీ లేదా అమితాబ్ బచ్చన్, నాగార్జున, కమల్ హాసన్ అంటూ లెక్కలు వేసినా వీళ్లెవరూ సల్మాన్ కి దరిదాపుల్లో కూడా లేరు.
హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. సల్మాన్ ఖాన్ `బిగ్ బాస్ 18` సీజన్ కి హోస్టింగ్ చేసినందుకు నెలకు రూ.60 కోట్లు వసూలు చేస్తాడు. ఈ సీజన్ 6 అక్టోబర్ 2024న కలర్స్ టీవీ, జియో సినిమాలో ప్రీమియర్ అయింది. ప్రొడక్షన్ టీమ్ సన్నిహిత వర్గాల ప్రకారం.. సల్మాన్ గత ఏడాది తన ఫీజు భారీగా పెంచాడని, నెలకు 60కోట్లు అందుకుంటున్నాడని తెలిసింది. బిగ్ బాస్ 18 మునుపటి సీజన్ లాగానే 15 వారాల పాటు నడిచింది. 19 జనవరి 2025న చివరి ఎపిసోడ్‌తో ముగిసింది. కరణ్ వీర్ మెహ్రా ఈ సీజన్ విజేత.
కేబీసీ షో కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ అత్యధిక మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు అతడు 5 కోట్లు అందుకుంటున్నాడు. కానీ సల్మాన్ కంటే అమితాబ్ కి ఎక్కువ శ్రమ ఉంటుంది. ఎక్కువ సమయం కేటాయించాలి. అత్యంత ధనవంతుడైన టీవీ స్టార్ కపిల్ శర్మ `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో` సీజన్ 1 కోసం దాదాపు రూ.60 కోట్లు సంపాదించాడని సమాచారం. మహిళా టీవీ స్టార్ రూపాలి గంగూలీ `అనుపమ` కోసం ఎపిసోడ్ కు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున బిగ్ బాస్- తెలుగు ఒక్కో సీజన్ కోసం 30కోట్లు అందుకుంటుండగా, కమల్ హాసన్ తమిళ్ బిగ్ బాస్ సీజన్ కోసం 130 కోట్లు అందుకున్నారని కథనాలొచ్చాయి.
