అది తలచుకుంటేనే భయంగా ఉంది
రీసెంట్ గా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 18 July 2025 12:00 AM ISTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అందుకుని చాలా కాలమవుతుంది. గత కొన్ని సినిమాలుగా సల్మాన్ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. దీంతో ఎలాగైనా తన తర్వాతి సినిమాతో హిట్ అందుకోవాలని చాలా కసిపై ఉన్నారు సల్మాన్. కాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నారు.
2020లో లడాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇండియా, చైనా కు చెందిన జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా, ఆ సంఘటనలో 20 మంది భారతీయ జవాన్లు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ వాస్తవ సంఘటన ఆధారంగా అపూర్ లఖియా ఈ సినిమాను తెరకెక్కించనుండగా, సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ లో ఆర్మీ ఆఫీసర్ గా నటించనున్నారు.
రీసెంట్ గా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. మరో పది రోజుల్లో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మొదలవనుందని, ఎన్నో కష్టమైన ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నామని తెలిపారు. లడాఖ్ లోని కొన్ని లొకేషన్లలో సినిమాలోని కీలక సీన్స్ ను షూట్ చేయనున్నామని, గడ్డ కట్టే చలిలో 8 రోజుల పాటూ షూటింగ్ చేయనున్నామని సల్మాన్ తెలిపారు.
అంతటి చలిలో షూటింగ్ అని తలచుకుంటేనే భయంగా ఉందని, అయినప్పటికీ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ లో నటించడానికి తాను రెడీగా ఉన్నానని సల్మాన్ తెలిపారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన చిత్రాంగద సింగ్ నటించనున్నారు. ఈ సినిమా తర్వాత సల్మాన్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను చేయనున్నారు. దాంతో పాటూ 2015లో వచ్చిన సూపర్ హిట్ సినిమా బజరంగీ భాయిజాన్ సీక్వెల్ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
