లాభాలు ఇద్దరికి.. నష్టం మాత్రం ఒకరికే..
ఎవరూ ఊహించనవి జరగడమే జీవితమంటే. సినీ ఇండస్ట్రీ కూడా దీనికి అతీతం కాదు.
By: Sravani Lakshmi Srungarapu | 19 Aug 2025 11:00 AM ISTఎవరూ ఊహించనవి జరగడమే జీవితమంటే. సినీ ఇండస్ట్రీ కూడా దీనికి అతీతం కాదు. ఇండస్ట్రీలో కూడా చాలా సార్లు కనీసం ఎవరూ కలలో కూడా అనుకోనివి జరుగుతుంటాయి. భారీ అంచనాలతో, స్టార్ క్యాస్టింగ్ తో వచ్చిన సినిమాలు సైతం డిజాస్టర్లు అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చిన ఎన్నో సినిమాలు మ్యాజిక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన దాఖలాలున్నాయి.
సైయారాతో బ్లాక్ బస్టర్
తాజాగా బాలీవుడ్ లో అలాంటి పరిస్థితే ఏర్పడింది. హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యష్ రాజ్ ఫిల్మ్స్‌ది అదే సిట్యుయేషన్. ఈ సంస్థ నుంచి జులై లో వచ్చిన చిన్న సినిమా సైయారా పై రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. ఆ కారణంతోనే చిత్ర నిర్మాణ సంస్థ మొదటి రోజు స్టూడెంట్స్ కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చి పుష్ చేసింది.
జాయింట్ వెంచర్ గా సైయారా
రిలీజ్ తర్వాత సినిమాకు మంచి టాక్ రావడంతో యష్ రాజ్ ఫిల్మ్ కు సైయారా కలెక్షన్లు కురిపించింది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. అయితే సైయారాకు యష్ రాజ్ ఫిల్మ్స్ సోలో నిర్మాణ సంస్థ కాదు. ఆ సినిమాను అక్షయ్ విధ్వానీతో కలిసి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. కాబట్టి ఎంత లాభాలొచ్చినా అందులో షేరింగ్ అవుతుంది.
ఇక అదే యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి ఆగస్ట్ 14న వార్2 సినిమా వచ్చింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్2 భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలుండటంతో ఓపెనింగ్స్ వరకు బాగానే వచ్చాయి కానీ సోమవారం నుంచి సినిమాకు అసలైన డ్రాప్స్ మొదలవడంతో బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అయితే సైయారా సినిమాలాగా వార్2 నిర్మాణంలో ఎవరూ భాగస్వాములు లేరు. నష్టం మొత్తాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థనే భరించాల్సి ఉంది.
తప్పంతా ఆయనదే!
స్టార్ క్యాస్టింగ్, బ్లాక్ బస్టర్ వార్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో పాటూ యష్ రాజ్ ఫిల్మ్స్ లాంటి బ్యాకప్ ఇన్ని ఉన్నా వార్2 ను కాపాడలేకపోయాయి. దానికి ప్రధాన కారణం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. వార్ సినిమాలో ఉన్న గ్రిప్పింగ్ వార్2 లో మిస్ అయింది. వార్ సినిమాకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ఎలాంటి కథనైనా సరే చాలా స్టైలిష్ గా, ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసేవారు. కానీ అయాన్ ముఖర్జీ వనరులు అన్నీ ఉన్నా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కథ దగ్గర నుంచి, క్యారెక్టరైజేషన్ల వరకు ఎక్కడా మెప్పించలేకపోయారు. ఇక వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడే పనిలేదు.
భారీ ఫ్లాపుగా వార్2
ఏదేమైనా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమా విషయంలో సిద్దార్థ్ ఆనంద్ తో కాకుండా అయాన్ ముఖర్జీతో ముందుకెళ్లి భారీ మొత్తంలోనే నష్టపోయింది. బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 2025లో బాలీవుడ్ లో ఏ నిర్మాణ సంస్థకీ రానంత భారీ నష్టం వార్2 తో రాబోతుందని అంటున్నారు. మరి యష్ రాజ్ సంస్థకు ఈ నష్టాన్ని ఏ సినిమా పూడ్చుతుందో చూడాలి.
