Begin typing your search above and press return to search.

రెండుసార్లు ట్ర‌యాథ్లాన్ విజేత‌గా 'వైల్డ్ డాగ్' స‌యామీ

స‌యామీ స్వ‌త‌హాగా క్రీడాకారిణి. ఇప్పుడు క్రీడా రంగంలో త‌ను సాధించిన ఓ ఘ‌న‌త స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Tupaki Desk   |   9 July 2025 9:00 AM IST
రెండుసార్లు ట్ర‌యాథ్లాన్ విజేత‌గా వైల్డ్ డాగ్ స‌యామీ
X

క్రీడా ప్రపంచంలో రాణిస్తూ, న‌ట‌రంగంలో పాపుల‌రైన‌వారు త‌క్కువ‌. డాక్ట‌ర్లు కాబోయి యాక్ట‌ర్లు అయిన వారే ఎక్కువ‌. అరుదుగా మాత్రమే క్రీడాకారిణులు సినీరంగంలోను ప్ర‌య‌త్నించారు. అదే కేట‌గిరీకి చెందుతుంది స‌యామీ ఖేర్. ఇంత‌కుముందు నాగార్జున `వైల్డ్ డాగ్` చిత్రంలో ఏజెంట్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించిన స‌యామీ, త‌న కెరీర్ ని ప్రారంభించింది టాలీవుడ్ లోనే. సాయిధ‌ర‌మ్ తేజ్ - వైవియ‌స్ చౌద‌రి కాంబినేష‌న్ మూవీ `రేయ్`తో తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో న‌టించింది.

స‌యామీ స్వ‌త‌హాగా క్రీడాకారిణి. ఇప్పుడు క్రీడా రంగంలో త‌ను సాధించిన ఓ ఘ‌న‌త స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో `ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్‌`ను పూర్తి చేసిన భార‌తీయ న‌టిగా రికార్డు సృష్టించింది. దీనితో ఏడెనిమిది నెల‌ల గ్యాప్ లోనే ప్రతిష్టాత్మక ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్‌ను రెండుసార్లు జయించిన మొదటి భారతీయ నటిగా సయామి నిలిచింది. గ‌త ఏడాది సెప్టెంబర్ 2024లో బెర్లిన్‌లో తన మొదటి ఐరన్‌మ్యాన్ 70.3ని పూర్తి చేసింది. అంతర్జాతీయ ఎండ్యూరెన్స్ రేసింగ్ సర్క్యూట్‌లో ఈ భామ‌ అరంగేట్రం చేసింది.

70.3 అనేది అథ్లెట్లు ప్రయాణించిన మొత్తం దూరాన్ని మైళ్ల‌లో సూచిస్తుంది. స్విమ్మింగ్- సైక్లింగ్- ర‌న్నింగ్ ఈ మూడింటిని ట్ర‌యాథ్లాన్ గా పిలుస్తారు. ఇందులో 1.9 కి.మీ స్విమ్మింగ్, 90 కి.మీ సైక్లింగ్, 21.1 కి.మీ హాఫ్ మారథాన్ ఉన్నాయి..ఇవ‌న్నీ ఒకే రోజులో పూర్తి చేయాలి. ప్రపంచంలోని అత్యంత కష్టతరమైన ట్రయాథ్లాన్‌లలో విజ‌యం కోసం తాను ఎలా సిద్ధమైందో తాజా ఇంట‌ర్వ్యూలో స‌యామీ వెల్ల‌డించింది. ఆరు నెల‌ల పాటు అత్యంత క‌ఠిన శిక్ష‌ణ తీసుకున్నాన‌ని స‌యామీ వెల్ల‌డించింది. నేను చాలా డిమాండ్ ఉన్న‌, అలాగే కఠినంగా మారే పరిశ్రమలో పని చేస్తున్నాను. నాకు, అన్యాయంగా అనిపించే విషయాలను ఎదుర్కోవడానికి నేను ఇలాంటి ఒక మార్గాన్ని ప్ర‌య‌త్నిస్తాను అని చెప్పింది స‌యామీ. నేను ఉన్న ప‌రిశ్ర‌మ‌లో ఏది వ‌ర్క‌వుట్ కాక‌పోయినా ఓర్పు కావాలి. దానిని క్రీడ‌ల నుంచి తీసుకుంటున్నాన‌ని కూడా స‌యామీ వ్యాఖ్యానించారు. స‌యామీ ఇటీవ‌లే విడుద‌లై విజ‌యం సాధించిన జాత్ అనే చిత్రంలో న‌టించింది. స‌న్నీడియోల్- గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించింది.