Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సైంధవ్

By:  Tupaki Desk   |   13 Jan 2024 8:04 AM GMT
మూవీ రివ్యూ : సైంధవ్
X

సైంధవ్ మూవీ రివ్యూ

నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి - శ్రద్ధా శ్రీనాథ్ - నవాజుద్దీన్ సిద్ధిఖీ - ఆర్య - రుహాని శర్మ - ఆండ్రియా - బేబీ సారా పాలేకర్ తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

ఛాయాగ్రహణం: మణికందన్

నిర్మాత: వెంకట్ బోయనపల్లి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శైలేష్ కొలను

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్ మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీతో ఆకట్టుకున్న శైలేష్ కొలను రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలు ఏంటో చూద్దాం పదండి.

కథ:

సైంధవ్ (వెంకటేష్ దగ్గుబాటి) చంద్రప్రస్థ అనే సిటీలో పోర్టులో క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. తన భార్యను కోల్పోయిన అతడికి కూతురు (సారా పాలేకర్) అంటే ప్రాణం. తన భర్త నుంచి విడిపోయిన మనో (శ్రద్ధా శ్రీనాథ్)తో కలిసి జీవిస్తూ.. పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న సైంధవ్ కు గుండె పగిలే వార్త తెలుస్తుంది. ఒక అరుదైన జబ్బు బారిన పడిన తన పాపను కాపాడుకోవడానికి 17 కోట్ల రూపాయల ఇంజక్షన్ అవసరం పడుతుంది. మామూలు మధ్యతరగతి వ్యక్తిలా కనిపించే సైంధవ్.. అంత ఖరీదైన ఇంజక్షన్ తెచ్చి పాపను కాపాడుకోగలిగాడా.. అందుకోసం అతను ఏం చేశాడు.. చివరికి పాప బతికిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

తల్లి లేని పాప.. ఆ పాపను ప్రాణంగా ప్రేమించే తండ్రి.. ఆ పాపకు ప్రాణాపాయం.. తనను కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి తండ్రి చేసే పోరాటం.. ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉన్న స్టోరీ పాయింట్ ఇది. ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న వెంకటేష్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యే లైన్ ఇది. హిట్ ఫ్రాంచైజీ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన శైలేష్ కొలను లాంటి దర్శకుడు వెంకీతో ఇలాంటి సినిమా తీస్తున్నాడు అంటే.. మనకు కూడా ఖైదీ లాంటి మంచి సినిమా పడుతుందని అనుకుంటాం. కానీ శైలేష్ తన శైలిలో థ్రిల్ చేయలేకపోయాడు. అలాగే వెంకీ తరహాలో ఎమోషన్లు పండించలేకపోయాడు. కేవలం యాక్షన్ ఘట్టాలను స్టైలిష్ గా తీర్చిదిద్దడం మీదే దృష్టి పెట్టి.. ఒక సగటు యాక్షన్ సినిమానే అందించాడు.

జాన్ విక్.. కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాలకు బెంచ్ మార్క్ గా నిలుస్తున్న హాలీవుడ్ మూవీ. సీనియర్ హీరోలు స్టైలిష్ యాక్షన్ సినిమాలు చేయాలంటే చాలు.. దీని వైపే చూస్తున్నారు. మనదైన ఎమోషన్ కొంత జోడించి.. యాక్షన్ ఘట్టాలను జాన్ విక్ తరహాలో స్టైలిష్ గా తీర్చిదిద్దితే ఈజీగా పాస్ అయిపోవచ్చని యువ దర్శకులు భావిస్తున్నారు. ఇంతకుముందు అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ మూవీలో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే ఒక ఎమోషన్.. ఒక బిల్డప్ లేకుండా.. ఊరికే యాక్షన్ సన్నివేశాలు తీసేస్తే కోరుకున్న కిక్ రాదని ఆ సినిమా రుజువు చేసింది. ఇప్పుడు సైంధవ్ సినిమాలోనో అదే సమస్య తలెత్తింది. ఘోస్ట్ తో పోలిస్తే సైంధవ్ లో శైలేష్ కొలను బెటర్ స్టోరీనే ఎంచుకున్నాడు. తండ్రి కూతురు ఎమోషన్.. 17 కోట్ల రూపాయల ఇంజక్షన్.. స్మగ్లింగ్ మాఫియాతో హీరో కనెక్షన్.. ఇలా సెటప్ అంతా బాగానే కుదిరింది. కానీ హీరో పాత్రకు అవసరమైన బిల్డప్.. ఎస్టాబ్లిష్మెంట్ సరిగా జరగలేదు. దీనికి తోడు నవాజుద్దీన్ సిద్ధిఖి లాంటి విలక్షణ నటుడు ఉన్నా కూడా.. విలన్ పాత్రలో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. ఆ క్యారెక్టర్ని ఒక జోకర్ తరహాలో తీర్చిదిద్దడం వల్ల దాన్ని చూసినప్పుడల్లా కామెడీగా అనిపిస్తుంది తప్ప భయం, క్యూరియాసిటి కలగవు. విలన్ పాత్ర బలంగా లేనప్పుడు హీరో ఎంత యాక్షన్ విన్యాసాలు చేస్తేనేమి.. కోరుకున్నంత కిక్ రాదు. అదే సైంధవ్ సినిమాకు అతి పెద్ద సమస్యగా నిలిచింది. ఇప్పుడంతా ఒక కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్ళి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ట్రెండుగా మారిన నేపథ్యంలో శై లేష్ చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీనైతే క్రియేట్ చేశాడు కానీ అందులో వావ్ అనిపించేలా ఏదీ చూపించలేకపోయాడు.

ప్రతికూల విషయాలు పక్కన పెడితే.. సైంధవ్ సినిమాను డ్రైవ్ చేసేది వెంకీ పెర్ఫార్మెన్స్.. ఆయన చేసిన యాక్షన్ విన్యాసాలే. పాత్రల పరిచయం.. తండ్రి కూతుళ్ల మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సాగే తొలి అర గంట నెమ్మదిగా అనిపిస్తుంది. హీరోకు ఒక టాస్క్ క్రియేట్ అయి.. అతను రంగంలోకి దిగాక కానీ సినిమాలో ఊపు రాదు. ఒక్కసారి హీరో తన షర్ట్ బటన్ విప్పి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టాక.. చివరి వరకు యాక్షన్ మోత కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలకు అవసరమైన బిల్డప్ మాత్రం అన్నిచోట్ల కుదరలేదు. ఎగుడుదిగుడుగా సాగే ప్రథమార్ధం మిశ్రమానుభూతిని కలిగిస్తే.. ద్వితీయార్థం మెరుగ్గా అనిపిస్తుంది. రెండు చోట్ల ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయింది. వెంకీ తన పెర్ఫామెన్స్ తో ఆ సన్నివేశాలను నిలబెట్టాడు. విలన్ పాత్రకు సరైన ఎలివేషన్ ఇచ్చి ఉంటే చివరికి సైంధవ్ మంచి స్థాయిలో నిలబడేది. కానీ ఆ పాత్రను తేల్చి పడేయడం నిరాశ కలిగిస్తుంది. దర్శకుడు పాప పాత్రకు ప్రేక్షకులు ఊహించిన దానికి భిన్నమైన ముగింపు ఇచ్చాడు. ఇది వైవిధ్యంగా అనిపించినా.. మంచి ఫీలింగ్ అయితే ఇవ్వదు. క్లైమాక్స్ ఒక మోస్తరుగా అనిపిస్తుంది. హీరో గతం తెలుసుకోవాలని చాలా సేపు ఎదురు చూస్తాం కానీ.. ఖైదిలో మాదిరి సీక్వెల్ వచ్చేవరకు ఆగాలని చావు కబురు చల్లగా చెప్పాడు దర్శకుడు. అయితే ఖైదిలో మిగతా ఎమోషన్ వర్కవుట్ అయ్యింది కాబట్టి హీరో గతం గురించి పెద్దగా ఆలోచన రాదు. కానీ సైంధవ్ మాత్రం ఆ గతాన్ని ముందే చూపించి ఉంటే హీరో పాత్ర బాగా ఎలివేట్ అయ్యేదేమో అనిపిస్తుంది. సైంధవ్ చూశాక హీరో గతం తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతమాత్రం పుడుతుంది అన్నది సందేహమే.

నటీనటులు:

వెంకటేష్ తన వయసుకు ఆహార్యానికి తగ్గ పాత్రలో కనిపించాడు. వెంకీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ చాలా బాగుంది. యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాలో క్యారెక్టర్ కు తగ్గట్లు ఫిట్ గా కూడా కనిపించాడు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీని ఆయన తన నటనలో చూపించాడు. ఎమోషనల్ సీన్లలో వెంకీ నటన స్టాండౌట్ గా నిలుస్తుంది. విలన్ పాతలో నవాజుద్దీన్ సిద్ధిఖి అనగానే చాలా ఊహించుకుంటాం. అయితే మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఆ క్యారెక్టర్ తర్వాత తేలిపోయింది. పాత్రలో ఏ ప్రత్యేకత లేకపోవడంతో నవాజ్ ఏదో ట్రై చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మనో పాత్రకు శ్రద్ధ శ్రీనాథ్ బాగానే సూట్ అయింది కానీ.. ఆమెకు కూడా పెద్దగా రోల్ లేదు. తమిళ హీరో ఆర్యను ఏరుకోరి ఓ పాత్రకి ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. అతడి లుక్ బాగుంది కానీ క్యారెక్టర్ మరీ పేలవం. కథలో కీలకమైన పాత్రలో బేబీ సారా బాగానే చేసింది. రుహానీ.. ముకేష్ రుషి.. జిషు సేన్ గుప్తా.. రవి వర్మ లాంటి ఆర్టిస్టులు అందరూ మామూలే.

సాంకేతిక వర్గం:

ఎలాంటి సినిమాకు పనిచేసినా తన సంగీతంతో బలమైన ముద్ర వేసే సంతోష్ నారాయణన్.. సైంధవ్ విషయంలో నిరాశపరిచాడు. సాంకేతికంగా సైంధవ్ సినిమాకు అతి పెద్ద బలహీనత సంగీతమే. ఇటు పాటల్లో.. అటు బ్యాగ్రౌండ్ స్కోర్లో సంతోష్ తన ప్రత్యేకతను చూపించలేకపోయాడు. సన్నివేశాలను బిజిఎం ఎలివేట్ చేయలేకపోయింది. మణికందన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. హిట్ ఫ్రాంచైజీ సినిమాలతో తన మీద అంచనాలు పెంచిన రైటర్ కం డైరెక్టర్ శైలేష్ కొలను.. నిరాశపరిచాడు. సైంధవ్ కథకు సంబంధించి బేసిక్ ఐడియా బాగున్నప్పటికీ.. దాని చుట్టూ కథా కథనాలను ఆసక్తికరంగా అల్లడంలో శైలేష్ విఫలమయ్యాడు. యాక్షన్ బ్లాక్స్.. కొన్ని ఎమోషనల్ సీన్ల వరకు బాగా డీల్ చేసినా.. ఓవరాల్ గా మెప్పించలేకపోయాడు.

చివరగా: యాక్షన్ ఎక్కువ.. ఎమోషన్ తక్కువ

రేటింగ్: 2.5/5