తిరువీర్ కు 'పాపం స్టార్' ట్యాగ్ ఇవ్వాలా?
సాయిలు కంపాటి మాట్లాడుతూ పాపం అనే పదం సమాజంలో కష్టపడి బతికే సాధారణ మనుషులకు బాగా దగ్గరగా ఉంటుందని అన్నారు.
By: M Prashanth | 12 April 2026 2:04 PM ISTగతేడాది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో అందరినీ ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తాజాగా నటిస్తున్న చిత్రం పాపం ప్రతాప్ ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సాయిలు కంపాటి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈవెంట్ లో మాట్లాడిన సాయిలు కంపాటి తిరువీర్ ను ఉద్దేశించి 'నీ మొహం చూస్తే పాపం అనిపిస్తుంది అన్నా.. నీకు పాపం స్టార్ అనే ట్యాగ్ పెట్టాలి' అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో వేదికపై ఉన్నవారంతా కాసేపు నవ్వుల్లో మునిగిపోయారు. ఆ సరదా కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
సాయిలు కంపాటి మాట్లాడుతూ పాపం అనే పదం సమాజంలో కష్టపడి బతికే సాధారణ మనుషులకు బాగా దగ్గరగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని, మళ్లీ లేచి నిలబడేందుకు ప్రయత్నించే వారిని చూస్తే పాపం అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 'దేవుడా ఒక్క ఛాన్స్ ఇవ్వు అని కోరుకునే వారందరిలో ఆ భావన కనిపిస్తుంది' అని తెలిపారు.
అలాగే పాపం ప్రతాప్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే సాయిలు కంపాటి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలతో ఆయన తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్నారు. అదే తరహాలో పాపం ప్రతాప్ కూడా వినోదంతో పాటు భావోద్వేగాలను కలగలిపిన కథగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.
ఇక తిరువీర్ విషయానికి వస్తే, మసూద, ‘పరేషాన్ వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సాధారణ వ్యక్తి పాత్రల్లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తిరువీర్, ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రతోనే ముందుకొస్తున్నారు. పాపం ప్రతాప్ లో ఆయన ప్రతాప్ అనే యువకుడిగా కనిపించనున్నారు. సినిమా కథ 1990ల కాలంలో ఒక గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.
చిన్నప్పటి నుంచే ప్రేమించుకున్న ప్రతాప్, బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి అయిన మూడు రోజులకే వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక అనుకోని సంఘటన వల్ల ప్రతాప్ అందరి ముందు పాపం ప్రతాప్ గా మారిపోతారు. ఆ పరిస్థితి ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీర ప్రతాప్ గా ఎలా నిలిచాడు? అన్నదే సినిమా ప్రధాన కథాంశం. ఎస్.పి. దుర్గా నరేష్ తెరకెక్కించగా, నిర్మాణ బాధ్యతలను ఈటీవీ విన్, కృషి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి చేపట్టాయి. ఏప్రిల్ 17, 2026న సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.
