నాలుగో కేసుకు ముందు మరో ప్రయోగం..!
శైలేష్ కొలను హిట్ 3 తో మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాను మొదలు పెట్టాలని శైలేష్ కొలను ప్రయత్నాలు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 28 April 2025 11:32 AM ISTహాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే క్రైమ్ జానర్ ప్రాంచైజీ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ ప్రాంచైజీలో మొత్తం ఏడు కేసులకు సంబంధించిన సినిమాలు తీయనున్నట్లు ఇప్పటికే పలు సార్లు దర్శకుడు శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. హిట్ మొదటి కేసులో విశ్వక్ సేన్ కనిపించగా, హిట్ రెండో కేసులో అడవి శేష్ నటించాడు. తాజాగా రూపొందిన హిట్ 3లో నాని హీరోగా నటించాడు. మొదటి రెండు హిట్‌లతో పోల్చితే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి దేశ సరిహద్దు నేపథ్యంలో కథను తీసుకోవడంతో బడ్జెట్ పెరిగింది. అంతే కాకుండా ఈసారి హిట్ మొదటి రెండు హిట్‌లతో ఎంత వచ్చిందో అంతకు మించి వస్తుందనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
శైలేష్ కొలను హిట్ 3 తో మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాను మొదలు పెట్టాలని శైలేష్ కొలను ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే కొత్త కథను రెడీ చేశాడని, సీనియర్ హీరో నాగార్జునకు చెప్పారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున సైతం స్టోరీ లైన్‌కి ఫిదా అయ్యి, కచ్చితంగా చేద్దామని హామీ ఇచ్చాడట. హిట్ 3 కి పాజిటివ్ టాక్ వస్తే ఇదే ఏడాదిలో నాగార్జునతో శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హిట్ 4 కోసం కథ రెడీగా ఉన్నా దాని కంటే ముందు నాగార్జునతో సినిమా ఉంటుందని తెలుస్తోంది.
హిట్ 2 తర్వాత వెంటనే హిట్ 3 చేయకుండా మధ్యలో వెంకటేష్‌తో 'సైంధవ్' అనే సినిమాను ప్రయోగాత్మకంగా దర్శకుడు శైలేష్ కొలను రూపొందించాడు. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో శైలేష్ కొలను క్రైమ్ జానర్ సినిమాలు మాత్రమే తీయగలడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అంటే అది హిట్ ప్రాంచైజీ మాత్రమే కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం మధ్య మధ్యలో ఇలా ప్రయోగాలు చేయాలని ఆశ పడుతున్నాడు. సైంధవ్ సినిమాతో శైలేష్ సక్సెస్ దక్కించుకోలేక పోయాడు. అయినా మరోసారి సీనియర్ హీరోతో ప్రయోగం చేసే అవకాశాలు ఉన్నాయి.
సైంధవ్ సినిమా తరహాలో కాకుండా ఒక క్రైమ్ కథను తీసుకుని సినిమాను రూపొందించేందుకు గాను శైలేష్ కొలను కథను రెడీ చేశాడట. హిట్ ప్రాంచైజీ కాకుండా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథతోనే నాగార్జునతో సినిమాను రూపొందించేందుకు శైలేష్ కొలను కథను రెడీ చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హిట్ 3 విడుదల తర్వాత పూర్తి స్థాయి స్క్రిప్ట్‌తో శైలేష్ కొలను వెళ్లి నాగార్జునను కలిసే అవకాశాలు ఉన్నాయి. హిట్ 3 కి పాజిటివ్ టాక్ వచ్చి, స్క్రిప్ట్ నచ్చితే నాగార్జున మరో ఆలోచన లేకుండా సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున త్వరలో కుబేరా, కూలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ రెండు సినిమాల్లోనే ముఖ్య పాత్రల్లో కనిపించాడు. నాగార్జున హీరోగా సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
