హిట్ డైరెక్టర్ ఇక వీటికే పరిమితమా?
చాలా మంది డైరెక్టర్లు ఒకే జానర్‌కు స్టికాన్ కాకుండా భిన్నమైన .జానర్‌లను టచ్ చేస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 2 May 2025 7:20 AMచాలా మంది డైరెక్టర్లు ఒకే జానర్‌కు స్టికాన్ కాకుండా భిన్నమైన .జానర్‌లను టచ్ చేస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఒకే జానర్‌కు స్టిక్ అయి సినిమాలు చేస్తుంటారు. ఆ కోవలోకి వస్తున్నారు యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో ఆప్టోమెట్రీ పూర్తి చేసిన శైలేష్ కొలను యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో పీహెచ్‌డీ చేసి డాక్టర్ అయ్యారు. అయితే తండ్రి శేషగిరిరావు కొలను సినిమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేయడంతో శైలేష్‌కు కూడా సినిమాపై ఆసక్తి ఏర్పడింది.
దీంతో డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి సినిమాల్లోకి రావాలనుకున్నారు. చెక్‌లిస్ట్ షార్ట్ ఫిలింతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టి దాని ద్వారా `హిట్` మూవీని తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నారు. శైలేష్ కొలను డైరెక్టర్‌గా పరిచయం అవుతూ చేసిన మూవీ ఇది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై హీరో నాని సమర్పణలో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందింది. మంచి విజయాన్ని అందుకుంది.
దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా `హిట్ 2`ని అడివి శేష్‌తో తీయడం, అది కూడా హిట్ అనిపించుకోవడం తెలిసిందే. దీని తరువాత హిట్ యూనివర్స్ నుంచి బయటికి వచ్చి శైలేష్ చేసిన మూవీ `సైంధవ్`. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. పక్కాగా చెప్పాలంటే ఇదొక మెడికల్ థ్రిల్లర్. మెడికల్ అంశాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీ ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. శైలేష్ హిట్ యూనివర్స్‌నే గుర్తు చేయడం, అదే హీరో క్యారెక్టర్ కనిపించడం, కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, మితిమీరిన హింస వెరసి సినిమా ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేక ఫ్లాప్ అనిపించుకుంది.
దీని తరువాత శైలేష్ మళ్లీ హిట్ యూనివర్స్‌నే నమ్ముకున్నాడు. ఈ ఫ్రాంఛైజీలో తాజాగా చేసిన సినిమా `హిట్ 3`. నాని హీరోగా నటించిన ఈ సినిమా ఈ గురువారం విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే ఇది కూడా యాక్షన్ థ్రిల్లరే. డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాడు. ఆ నాలుగు కూడా యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌లే. ఈ జానర్ సినిమాలు తప్ప మరో జానర్ శైలేష్ టచ్ చేయలేదు. హిట్ పేరుతో పోలీస్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లని చేసిన శైలేష్ `హిట్ 3`తో హిట్ అందుకోవడంతో ఇక తను ఈ జానర్ సినిమాలకే పరిమితమా? అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.