బాలీవుడ్ లో ధురంధర్ కు ముందు తర్వాత!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్` ఎంతో పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
By: Srikanth Kontham | 9 July 2026 1:38 PM ISTఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన `ధురంధర్` ఎంతో పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రెండు భాగాలు కలిపి 3000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియన్ ప్రాంచైజీ చిత్రాల్లో ధురంధర్ ఆ రకంగా సరికొత్త చరిత్రనే రాసింది. తాజాగా ఈ సినిమాను ఉద్దేశించి సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ధురంధర్ విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని అభిప్రా యపడ్డారు. ఈ చిత్రం విడుదల తర్వాత భారతీయ సినిమా తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.
`ధురంధర్` కు ముందు, ఆ తర్వాత అనే రెండు కాలాలుగా సినిమా రంగాన్ని విభజించవచ్చని ఇకనైనా చిత్ర పరిశ్రమ నిద్రలేవాలని సూచించారు. ఈ చిత్రంలో సంగీతాన్ని ఉపయోగించిన తీరు అద్భుతమని సైఫ్ కొనియాడారు. కేవలం సినిమా కోసం కొత్త ఆల్బమ్ సృష్టించడం కాకుండా ప్రపంచవ్యాప్త శైలులను, ఇంగ్లీష్ భాషను కూడా భయం లేకుండా మిళితం చేసిన విధానం విప్లవాత్మకమని మెచ్చుకున్నారు. ముఖ్యంగా `షరారత్` వంటి పాటలను చిత్రీకరించిన పద్ధతి ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ ఐటమ్ సాంగ్ భావనను మార్చేలా ఉందని ఆయన విశ్లేషించారు.
రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ గొప్ప విజయానికి ప్రధాన కారణమని ప్రశంసించారు. ఈ సినిమా కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా కథాంశం , సాంకేతికతలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిందని శంకర్, రామ్ చరణ్ వంటి అగ్ర దర్శకులు, నటులు పేర్కొన్నారు. ఇక రాకెష్ రోషన్ అయితే ఆదిత్య ధర్ ఈ చిత్రంతో ఓ కొత్త యుగానికి శ్రీకారం చుట్టారని ఇది మరొకరికి ముప్పు కాదు సినిమా రంగానికి ఎంతో అవసరమైన మార్పు అని అభివర్ణించారు. సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చూస్తుంటే బాలీవుడ్ కథాంశాల ఎంపికలో , సాంకేతికతలో `ధురంధర్` ప్రభావం రాబోయే కాలంలో మరిన్ని అద్భుతమైన చిత్రాలకు బాటలు వేస్తుందని తెలుస్తోంది.
వినూత్న ఆలోచనలతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ? ఈ భారీ విజయం నిరూపించింది. పాకిస్తాన్‌లోని లయారీ నేపథ్యంగా గూఢచారి కథాంశంతో సాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాస్తవ ఘటనలను కల్పిత కథతో అద్భుతంగా కలపడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. గల్ఫ్ దేశాలలో నిషేధం ఎదురైనప్పటికీ మిగిలిన ప్రపంచవ్యాప్త మార్కెట్లలో ఈ చిత్రం ఘనవిజయం సాధించడం విశేషం.
