ఫ్యామిలీతో గడిపితేనే.. స్టార్ హీరో సక్సెస్ ఫార్ములా!
సైఫ్ అలీఖాన్ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ అగ్ర హీరోగా కొనసాగుతున్న సైఫ్ ఖాన్ ఇటీవల దక్షిణాదిన విలన్ పాత్రలతో ఆకట్టుకున్నారు.
By: Tupaki Desk | 31 May 2025 9:37 AM ISTసైఫ్ అలీఖాన్ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ అగ్ర హీరోగా కొనసాగుతున్న సైఫ్ ఖాన్ ఇటీవల దక్షిణాదిన విలన్ పాత్రలతో ఆకట్టుకున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ లో రావణాసురుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అపరిచితుడి కత్తి పోట్ల ఘటనతో సైఫ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మర్మోగింది.
ఈ ఘటన తర్వాత, తిరిగి కోలుకుని సైఫ్ వరుస చిత్రాలతో బిజీ అయ్యాడు. అతడి నుంచి కొన్ని ఉత్తేజకరమైన సినిమాలు రాబోతున్నాయి. దర్శకుడు రాహుల్ ధోలాకియాతో `రేస్ 4`, ప్రియదర్శన్ తో టైటిల్ లేని ప్రాజెక్ట్, హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సోషల్ థ్రిల్లర్‌లో సైఫ్ కనిపించనున్నట్లు సమాచారం.
ఈ సమయంలో నిజమైన సక్సెస్ అంటే ఏమిటి? అని సైఫ్ ని ప్రశ్నిస్తే, అతడు తన కుటుంబంతో గడపడమే అసలైన విజయం అని అన్నారు. పిల్లల అవసరాలేమిటో గమనించి వారికి అవన్నీ సమకూర్చడం అవసరం. తీరిక వేళల్లో వంట చేయడం, ఇంట్లోనే గడపడం, పిల్లలతో ఆడుకోవడం నిజమైన సక్సెస్ అని అన్నారు.
అరబ్ మీడియా సమ్మిట్‌లో మాట్లాడుతూ.. విజయం అంటే ఏమిటో సైఫ్ వివరించారు. పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు తాను పని చేయనని, డ్యూటీకి వెళ్లనని సైఫ్ అన్నారు. తాను ఇంటికి వచ్చి నా పిల్లలు ఇప్పటికే నిద్రపోతున్నట్లు చూడటం ఇష్టం ఉండదు.. అది విజయం కాదు! అని అన్నారు. పిల్లలతో ఆ అరగంట గడపడానికి నేను ఇప్పుడే ఇంటికి వెళ్లాలి అని చెప్పగలగడం విజయం! అని అన్నారు. పిల్లల బాగోగులు చూడాల్సింది, తనిఖీ చేయాల్సింది తల్లిదండ్రులేనేని సైఫ్ అన్నారు. కుటుంబంతో చిన్న క్షణాలు ఎంత ముఖ్యమైనవో కూడా ఆయన మాట్లాడారు. పనికి వెళ్లడం ముఖ్యం, కానీ కలిసి పాస్తా వండటం, భోజనం చేయడం, పిల్లలపై దృష్టి పెట్టడం కూడా అంతే ముఖ్యం. అదే జీవితంలోని నిజమైన ఆనందం. నాకు విజయం అంటే పనికి నో చెప్పడం.. నా కుటుంబానికి అవును అని చెప్పగలగడం! అని ఆయన ఈ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు.
