ప్రముఖ హీరో 15000 కోట్ల ఆస్తులు నష్టపోయినట్టేనా?
ఇప్పుడు అలాంటి ఒక కేసు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మెడకు గుదిబండలా తగులుకుంది.
By: Tupaki Desk | 5 July 2025 11:06 AM ISTపూర్వీకుల ఆస్తులు లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తులను అనుభవించాలంటే చట్టపరంగా లోతైన అవగాహన ఉండాలి. చట్ట పరంగా సమస్యల్ని పరిష్కరించుకోనిదే ఆస్తులు వారసులకు దఖలు పడవు. భారతదేశంలోని చాలా భూములకు వారసులు వేరు.. అనుభవించేది వేరొకరు. అందువల్ల చాలా కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. ఇక భారతదేశం నుంచి వలస వెళ్లిపోయిన నవాబుల ఆస్తులను అనుభవించే వారికి ముప్పు తిప్పలు తప్పవు.
ఇప్పుడు అలాంటి ఒక కేసు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మెడకు గుదిబండలా తగులుకుంది. ఇంతకాలంగా పటౌడీ నవాబ్ వారసుడిగా పిలుపందుకున్న సైఫ్ కుటుంబం కొద్ది కాలంగా మధ్యప్రదేశ్ భోపాల్ లోని తన పూర్వీకులకు చెందిన 15000 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంలో కోర్టుల పరిధిలో విచాణను ఎదుర్కొంటోంది. ఈ ఆస్తులు సైఫ్ కి కానీ, అతడి కుటుంబానికి కానీ చెల్లవు అనేది ప్రత్యర్థుల ఆరోపణ. అంతేకాదు.. ఈ ఆస్తులన్నిటినీ ప్రభుత్వానికి చెందేలా చేయాలని కూడా పోరాటం సాగుతోంది.
వందల సంవత్సరాల నాటి వారసత్వ సంపదకు సైఫ్ వారసుడు కాడు. అతడి పూర్వీకులు పాకిస్తాన్ కి వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత వారి సంస్థానాలు, భూములను పూర్తిగా ప్రభుత్వానికి దఖలు పరచాలనే వాదన కోర్టులో వినిపిస్తున్నారు. ఈ కేసులో కోర్టుల నుంచి కూడా విచారణ సమయంలో ఏదీ సైఫ్ కు అనుకూలంగా లేదు. 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల తిరస్కరించడంతో అతడు చట్టపరంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు.
ఇండియా పాక్ విభజన సమయంలో సైఫ్ ఖాన్ పూర్వీకులు పాకిస్తాన్ కి వలస వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ ఆస్తులను సైఫ్ కానీ అతడి కుటుంబం కానీ అనుభవించడానికి సరిపోదు అనే వాదన వినిపిస్తోంది. దీనిపై సైఫ్ కోర్టులో పోరాడుతున్నాడు. ఈ ఆస్తుల్లో ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్ ఉస్ సబా ప్యాలెస్ , అహ్మదాబాద్ ప్యాలెస్ లాంటి చారిత్రాత్మక భవంతులు ఉన్నాయి. నవాబ్ వ్యక్తిగత ఆస్తులు రాజుల వారసత్వంలో భాగమే అయినా, తర్వాత ఎవరు పాలిస్తారో వారికి ఆస్తుల్ని కట్టబెట్టాలని వాదిస్తున్నారు. అలాగే దేశం విడిపోయి సైఫ్ ఖాన్ పూర్వీకులు వెళ్లిపోయారు గనుక, ఈ ఆస్తులను శత్రువు ఆస్తిగా చూడాలని కూడా చెబుతున్నారు. భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్ కి కానీ, చైనాకు కానీ వెళ్లిపోతే వారి ఆస్తులను శత్రువు ఆస్తిగానే పరిగణిస్తారు. ఆ ఆస్తులను ప్రభుత్వాలు కైవశం చేసుకుంటాయి. 13 డిసెంబర్ 2024న హైకోర్టు సైఫ్ తెచ్చుకున్న స్టేను రద్దు చేయడమే కాకుండా అతడి రెక్వస్ట్ ను పరిశీలించినా దానిని తిరస్కరించింది. షర్మిలా ఠాగూర్, సైఫ్ ఖాన్, సోహా అలీఖాన్ లకు వర్తించే భోపాల్ ఆస్తికి సంబంధించిన కేసు ఇప్పుడు ఆ కుటుంబానికి అనుకూలంగా లేదు. ప్రస్తుతం ఈ కేసును ఫ్రెష్ హియరింగుకి పిలుస్తూ మధ్య ప్రదేశ్ హైకోర్టు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.