సీతగా సాయి పల్లవినే ఎందుకంటే
సాయి పల్లవి మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం వల్ల ఆమె అందం కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకోకపోవడంతో పాటూ సహజంగా కనిపిస్తారనే కారణంతోనే సీత పాత్రకు ఆమెను ఎంపిక చేశామని చెప్పారు.
By: Tupaki Desk | 19 July 2025 4:00 PM ISTహీరోయిన్ అంటే కచ్ఛితంగా అందంగానే ఉండాలి, గ్లామర్ షో చేయాలి. భారీ గా మేకప్ లు వేసుకోవాలి. వీటన్నింటితో పాటూ ఎక్స్‌పోజింగ్ చేయాలి. కానీ వీటన్నింటికీ తాను మినహాయింపు అంటారు హీరోయిన్ సాయి పల్లవి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సాయి పల్లవి ఎప్పుడూ స్కిన్ షో చేసింది లేదు, మేకప్ వేసుకున్నదీ లేదు. ఇలాంటి సాయి పల్లవిని చూసి మొదట్లో చూసి ఈమె హీరోయిన్ ఏంటి అనుకున్నారంతా.
కానీ ఎప్పుడైతే సాయి పల్లవి స్క్రీన్ పై కనిపిస్తారో అప్పుడందరి దృష్టి, ఆలోచనా విధానం మారిపోతుంది. అదే ఆమె స్పెషాలిటీ. తన పక్కన ఎంత మంది ఉన్నా ఆడియన్స్ దృష్టిని ఇట్టే ఆకర్షించగలరామె. అందుకే సాయి పల్లవి నటించిన సినిమాలు ఫ్లాపవుతాయేమో కానీ నటిగా ఆమె మాత్రం ఎప్పుడూ ఫెయిలవలేదు. భానుమతిగా తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన సాయి పల్లవి, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. సాయి పల్లవి ఒక పాత్రను ఒప్పుకున్నారంటే ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి దానికి ప్రాణం పోయడం ఖాయం. ఎలాంటి కష్టమైన పాత్రనైనా సాయి పల్లవి తన నటనతో ఇట్టే పండించగలరు.
ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కాగా రామాయణలో సీతగా సాయి పల్లవిని తీసుకోవడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇండియన్ సినిమాలో ఎంతోమంది అందమైన హీరోయిన్లుండగా సీతగా సాయి పల్లవిని తీసుకోవడమేంటని అసహనం వ్యక్తం చేశారు. ఎంతో అందంగా ఉండే సీతాదేవి పాత్రలో సాయి పల్లవి ఎంతమేరకు సూటవుతారని అందరూ అంటున్న నేపథ్యంలో ఈ సినిమా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో రణ్‌బీర్, సాయి పల్లవిని తీసుకోవడం వెనుక గల కారణాల్ని తెలిపారు.
సాయి పల్లవి మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం వల్ల ఆమె అందం కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకోకపోవడంతో పాటూ సహజంగా కనిపిస్తారనే కారణంతోనే సీత పాత్రకు ఆమెను ఎంపిక చేశామని చెప్పారు. కృత్రిమంగా వచ్చే అందం కంటే ఆమె సహజ రూపమే సీత పాత్రను నమ్మదగినదిగా చేస్తుందని, సహజమైన అందానికి ప్రాధాన్యతనిస్తూనే పల్లవిని సెలెక్ట్ చేశామని ఆయన అన్నారు. పల్లవి కంటే ముందు ఎంతోమంది పరిశీలించినప్పటికీ సాయి పల్లవి కంటే ఎవరూ బెటర్ గా అనిపించలేదని చెప్పారు. ఇక రణ్‌బీర్ గురించి చెప్తూ ఆయన రియల్ లైఫ్ లో కూడా ప్రశాంతంగా, కాన్ఫిడెంట్ గా ఉంటారనే కారణంతోనే రాముడి పాత్రకు ఎంపిక చేశామన్నారు. రెండు భాగాలుగా రానున్న రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.
