Begin typing your search above and press return to search.

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

సాయి పల్లవి చేతికి ఎప్పుడూ కనిపించే రుద్రాక్ష మాల వెనుక ఆసక్తికరమైన జ్ఞాపకం ఉంది. తన కజిన్ శ్రీరంగం ఆలయం నుంచి తీసుకొచ్చిన ఈ మాలను తాతయ్య తనకు ఇచ్చారని ఆమె తెలిపారు. పరీక్షలకు ముందు ప్రార్థన కోసం ధరించడం మొదలుపెట్టిన మాల, ఇప్పుడు రోజువారీ అలవాటుగా మారిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   20 Nov 2026 2:40 AM IST
సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?
X

సావిత్రి ,సౌందర్య తర్వాత మళ్లీ అంతటి సహజ నటిగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. సినిమాల్లోనే కాదు, బయట కూడా ఆమె చాలా సాధారణంగా కనిపిస్తారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండే సాయి పల్లవి చేతికి.. దాదాపు ఎప్పుడూ ఒక రుద్రాక్ష మాల కనిపిస్తుంది. సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, షూటింగ్స్ ఇలా ఎక్కడ కనిపించినా ఆమె చేతికి ఆ మాల ఉండటం అభిమానులు గమనించే ఉంటారు. అయితే ఆమె ఆ రుద్రాక్ష మాలను ఎందుకు ధరిస్తారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తన చేతికి ఉండే రుద్రాక్ష మాల వెనుక ఒక అందమైన జ్ఞాపకం ఉందని సాయి పల్లవి చెప్పారు. ఈ మాలను తన కజిన్ తమ్ముడు తిరుచ్చిలోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకొచ్చారని ఆమె తెలిపారు. అయితే ఆ మాలను తనకు నేరుగా ఆయన ఇవ్వలేదని.. ముందుగా తన తాతయ్యకు ఇచ్చాడని. ఆ తర్వాత తన తాతయ్య తనకు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. "నా కజిన్ తిరుచ్చిలోని శ్రీరంగం ఆలయం నుంచి ఈ రుద్రాక్ష మాలను తీసుకొచ్చాడు. తాతయ్య దానిని తీసుకుని నాకు ఇచ్చారు. పరీక్షలకు ముందు రోజు ఈ రుద్రాక్ష మాలను తీసుకుని దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. అలా ప్రార్థించిన తర్వాత నిజంగానే పరీక్షలు బాగా రాసేదాన్ని. ఆ తర్వాత అది నా రోజువారీ అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు షూటింగ్‌కు వెళ్లేటప్పుడు కూడా ఈ మాలను ధరిస్తాను" అని చెప్పారు.

ఇక సాయి పల్లవి హీరోయిన్ గానే కాకుండా చదువులో కూడా తన ప్రతిభను రుజువు చేసుకున్న సంగతి తెలిసిందే. జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత భారత్‌లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE)లో కూడా ఉత్తీర్ణత సాధించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సాయి పల్లవి ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ధనుష్ నటిస్తున్న ఓం: చాప్టర్ 1లో ఆమె నిత్యారెడ్డి అనే ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఇప్పటికే విడుదలైన సాయి పల్లవి రామాయణం సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.